Director Krish | టాలీవుడ్ దర్శకుడు జాగర్లమూడి కృష్ణ (క్రిష్) పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. గమ్యం సినిమాతో టాలీవుడ్లో మెగాఫోన్ పట్టిన క్రిష్ ఆ తర్వాత వేదం, కంచె, కొండపోలం, వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అనుష్క శెట్టితో ఘాటి అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో అనుష్క ట్రైబల్ మహిళగా కనిపించబోతుంది. ‘వేదం’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబో మరోసారి రిపీట్ కావడం ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతోంది.
అయితే రీసెంట్గా ఘాటి సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసిన క్రిష్ రెండోసారి పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను క్రిష్ రెండో వివాహం చేసుకోబోతున్నారట. ఈ నెలలో ఎంగేజ్మెంట్ వచ్చే నెలలో పెళ్లి ఉండబోతున్నట్లు సమాచారం. అయితే క్రిష్ మొదట చేసుకున్న అమ్మాయి కూడా డాక్టర్ కావడం విశేషం. రమ్య వెలగతో క్రిష్‌కి 2016లో పెళ్లి అవ్వగా.. వీళ్లిద్దరు వ్యక్తిగత విభేదాలతో విడిపోయినట్లు తెలుస్తుంది. దీంతో చాలా రోజుల తర్వాత మళ్లీ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు క్రిష్.