‘నాకు హారర్ జోనర్ అంటే చాలా ఇష్టం. దానికి ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ‘కిష్కింధపురి’లో హారర్‌తో పాటు మిస్టరీ అంశాలుంటాయి. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా మెప్పిస్తుంది’ అన్నారు దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి. ఆయన నిర్ధేశకత్వంలో బెల్లకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ‘కిష్కింధపురి’ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సోమవారం దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి పాత్రికేయులతో ముచ్చటించారు.
ప్రేక్షకులకు ఓ విభిన్నమైన అనుభూతిని అందించాలనే తపనతో ఈ సినిమా చేశానని, ప్రతీ చిత్రంలో ఏదో కొత్త విషయాన్ని చెప్పాలన్నది తన లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ సినిమా కథను లోతుగా అర్థం చేసుకున్న వారికి రామాయణం తాలూకు రిఫరెన్స్‌లు దొరుకుతాయని, అందుకే ‘కిష్కింధపురి’ అనే టైటిల్ పెట్టామని కౌశిక్ పెగల్లపాటి పేర్కొన్నారు. రేడియో స్టేషన్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని, దీనికోసం 1969 కాలమాన పరిస్థితుల్ని తలపించేలా భారీ సెట్‌ను వేసి వింటేజ్ వైబ్‌ను క్రియేట్ చేశామని, తన తదుపరి సినిమా కోసం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయని కౌశిక్ పెగల్లపాటి అన్నారు.