ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘దేవర’కు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ వెలువడింది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు దర్శకుడు కొరటాల శివ బుధవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ‘ఎన్టీఆర్కు ఈ కథ చెప్పినప్పుడే చాలా ఎక్సైట్ అయ్యారు. ఓ సరికొత్త ప్రపంచంలో అత్యంత బలమైన పాత్రల నేపథ్యంలో కథ నడుస్తుంది.
షూటింగ్ టైమ్లో ప్రతీ ఎపిసోడ్ ఓ అద్భుతంలా అనిపించింది. ఇంతటి బిగ్ కాన్వాస్ ఉన్న సినిమాను రెండు భాగాలుగా తీస్తేనే బాగుంటుందనుకున్నాం. దాంతో మా టీమ్ అందరితో చర్చించి రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్నాం. ముందుగా ప్రకటించిన విధంగా తొలి భాగాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నాం’ అన్నారు. విస్మరణకు గురైన తీరప్రాంత నేపథ్య కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.