ఓ భర్త తన వైవాహిక జీవితంలో ఎలాంటి సందిగ్ధ పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు? తన అనుభవాల నుంచి మిగతా భర్తలకు ఏం తెలియజెప్పాడన్నదే ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాలో ప్రధానాంశమని చెప్పారు దర్శకుడు కిషోర్ తిరుమల. ఆయన నిర్ధేకత్వంలో రవితేజ, అషికా రంగనాథ్, డింపుల్ హయాతి జంటగా నటించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకురాబోతున్నది.
ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సందర్భంగా సోమవారం దర్శకుడు కిషోర్ తిరుమల విలేకరులతో మాట్లాడారు. ‘ఈ సినిమాలో ఇద్దరమ్మాయిలు అడిగిన ప్రశ్న చాలా కఠినంగా అనిపిస్తుంది. ఆ ప్రశ్న విని ఆడియెన్స్ కచ్చితంగా షాక్ అవుతారు. పెళ్లయిన వాళ్లందరూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే ప్రశ్న అది.
కానీ ఈ సినిమాలో దానికి సమాధానం చెప్పాం. ఈ కథను ఇల్లాలు, ప్రియురాలు అనే కోణంలో కాకుండా డిఫరెంట్గా ట్రీట్ చేశాం. ఓ సమస్యని వినోదాత్మక కోణంలో అర్థవంతంగా చర్చించే ప్రయత్నం చేశాం. ఫ్యామిలీ అందరూ కలిసి థియేటర్లలో ఎంజాయ్ చేసే సినిమా ఇది. ప్రస్తుతం దర్శకుడిగా కొన్ని కథలు సిద్ధంగా ఉన్నాయి. అందులో ఒకటి డివోషనల్ మైథాలజీ స్క్రిప్ట్, మరొకటి మున్నాభాయ్లాంటి సోషల్ సెటైర్ ఉన్న కథాంశం’ అని కిషోర్ తెలిపారు.