‘గతంలో షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ చేసిన నాకు సినీ దర్శకుడిగా ‘గాయపడ్డ సింహం’ తొలి సినిమా. ఇందులో హీరో తన ప్రేమకోసం అమెరికా వెళ్తాడు. అక్కడ బహిష్కరణకు గురై ఇండియాకు తిరిగివస్తాడు. తను అమెరికాలో ఏ కారణంగా బహిష్కరణకు గురయ్యాడు? ఆ ఫ్రస్టేషన్‌తో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది’ అని డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్ అన్నారు. ఆయన దర్శకత్వంలో తరుణ్‌భాస్కర్ హీరోగా రూపొందిన డార్క్ కామెడీ థ్రిల్లర్ ‘గాయపడ్డ సింహం’. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలు. జేడీ చక్రవర్తి కీలక పాత్రధారి. మే 1న సినిమా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా సోమవారం దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడారు. ‘బాలకృష్ణ ఓ సందర్భంలో వాడిన ‘నవ్వకు.. ఇది సీరియస్ మ్యాటర్’ అన్న మాటను టైటిల్‌కి ట్యాగ్‌లైన్‌గా పెట్టాం. బాలకృష్ణ అందరి జీవితాల్లో భాగం. అలాంటి వాళ్లు వాడిన మాటల్ని వాడితే ఒక రిలేటబులిటీ వస్తుందనే ఆలోచనతో ఈ టైటిల్ పెట్టాం. అంతేకాక హీరో పాత్రకు కూడా ఈ టైటిల్ యాప్ట్‌గా ఉంటుంది.
‘మనీ’ సినిమాలో బ్రహ్మానందం పాత్రలా ఇందులో పాత్రలన్నీ సీరియస్‌గా ఉంటాయి. కానీ వారిని చూస్తున్న ఆడియన్స్‌కి మాత్రం నవ్వొస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ‘మనీ’లో ఒక్క ఖాన్దాదానే ఉంటాడు. ఇందులో పాత్రలన్నీ ఖాన్దాదాలే’ అని చెప్పారు కశ్యప్ శ్రీనివాస్.