‘థియేటర్లకి వెళ్లి చూశాం. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ‘మ్యాడ్’ సినిమా యువతకు మాత్రమే చేరువైంది. కానీ ‘మ్యాడ్ స్కేర్’ని కుటుంబ ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు.’ అంటూ ఆనందం వెలిబుచ్చారు దర్శకుడు కల్యాణ్‌శంకర్. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మ్యాడ్ స్కేర్’. ఏడాదిన్నర క్రితం వచ్చిన ‘మ్యాడ్’ చిత్రానికి ఇది సీక్వెల్. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ముఖ్యపాత్రధారులు. హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మాతలు. మార్చి 28న విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లోనే 55.2కోట్లకు పైగా గ్రాస్‌ని రాబట్టిందని నిర్మాతలు చెబుతున్నారు. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో దర్శకుడు కల్యాణ్‌శంకర్ విలేకరులతో మాట్లాడారు. ‘పెద్ద కథ ఆశించి రాకండి.. సరదాగా నవ్వుకోవడానికి మాత్రమే రండి.. అని మేం విడుదలకు ముందే క్లారిటీగా చెప్పి ప్రేక్షకుల్ని ప్రిపేర్ చేశాం.
దాంతో ‘మ్యాడ్1’ ఫుల్న్ కలెక్షన్స్‌ని తొలిరోజే రాబట్టే స్థాయిలో ‘మ్యాడ్ స్కేర్’కి అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే వసూళ్లు వచ్చాయి. 15ఏండ్లుగా సినిమాలు చూడని వాళ్లు కూడా ‘మ్యాడ్ స్కేర్’ చూసేందుకు వస్తున్నారు. థియేటర్లలో ఓ రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం నిర్మాతలే. ఏ విషయంలోనూ రాజీపడలేదు. భీమ్స్ పాటలు, తమన్ ఆర్ఆర్, నవీన్ నూలి ఎడిటింగ్, నటీనటుల నటన.. అన్నీ సినిమాను ఈ స్థాయిలో నిలబెట్టాయి.’ అని తెలిపారు. కామెడీ అయినా.. ఉద్వేగమైనా ఊహించని రీతిలో ఆవిష్కరించడమే తన బలమని, త్వరలో రవితేజతో సినిమా చేయబోతున్నానని, అది కూడా ఇలాగే వినోదభరితంగా ఉంటుందని, సూపర్‌హీరో కాన్సెప్ట్‌తో సాగే ఫిక్షన్ కథాశమని దర్శకుడు కల్యాణ్‌శంకర్ చెప్పారు.