‘దృశ్యం’ సిరీస్‌లో వచ్చిన రెండు చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నాయి. మలయాళ అగ్ర హీరో మోహన్‌లాల్ నటించిన ఈ చిత్రాలకు జీతూ జోసేఫ్ దర్శకత్వం వహించారు. తెలుగు రీమేక్‌లో వెంకటేష్, హిందీ రీమేక్‌లో అజయ్‌దేవ్‌గణ్ హీరోలుగా నటించారు. కోవిడ్ సమయంలో ‘దృశ్యం-2’ మలయాళ, తెలుగు వెర్షన్స్‌ను ఓటీటీలో విడుదల చేయగా హిందీ వెర్షన్ మాత్రం థియేట్రికల్ రిలీజ్ జరుపుకుంది.
తాజా సమాచారం ప్రకారం దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సిరీస్‌లో మూడో భాగానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని, దీనికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని సెట్స్‌మీదకు తీసుకురానున్నారని సమాచారం.