‘డిఫరెంట్ జనరేషన్స్ నేపథ్యంలో సాగే సినిమా ‘స్వాగ్’. వంశవృక్షాన్ని ఆవిష్కరిస్తూ తయారు చేసిన స్క్రిప్ట్ ఇది. సింగా అనే కేరక్టర్ ప్రజెంట్ జనరేషన్. 90sకి సంబంధించిన కేరక్టర్ ఉంటుంది. అలాగే 70sకి సంబంధించిన కేరక్టర్ ఉంటుంది. ఇంకా ముందుకెళ్తే.. మూల పురుషుడికి చెందిన పాత్ర ఉంటుంది. ప్రతి జనరేషన్‌లోనూ శ్రీవిష్ణునే కనిపిస్తున్నారు. నాలుగు పాత్రలకూ సమ ప్రాధాన్యం ఉంటుంది. అచ్చ తెలుగు అంశాలతో, రూటెడ్ కల్చర్‌తో ఈ సినిమా సాగుతుంది.’ అని దర్శకుడు హసిత్ గోలి అన్నారు.
శ్రీవిష్ణు హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘స్వాగ్’. రీతూవర్మ కథానాయిక. మీరాజాస్మిన్, దక్ష నాగర్కర్ కీలక పాత్రధారులు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా హసిత్ గోలి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ‘పితృస్వామ్య వ్యవస్థ, పురుషాధిక్యతలపై స్త్రీల పోరాటాలు, తద్వారా నెలకొన్న లింగ విబేధాలు తరతరాలుగా ఉన్నవే.
ఇవి కాలగమనంలో ఎలా మారుతూ వచ్చాయి? వాటి ప్రస్తుత రూపమేంటి? అనే ఆలోచన లోంచి ఈ కథ పుట్టింది. పేర్ల, విషయంలో పాత్రల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. కథానుగుణంగా యయాతి, భవభూతి లాంటి పేర్లు వాడాం. కథ విషయం కన్ఫ్యూజన్ లేకుండా అందరికీ అర్థమయ్యేలా స్క్రీన్‌ప్లే రాసుకున్నాను. ఇందులో ఫన్‌కి ఢోకా ఉండదు. ఇంటర్వెల్ బ్లాక్ ఆశ్చర్యపోయేలా ఉంటుంది’ అని తెలిపారు హసిత్ గోలి. రీతూవర్మ, మీరా జాస్మిన్ పాత్రలు భిన్నంగా ఆసక్తికరంగా ఉంటాయని, వివేక్‌సాగర్ సంగీతం సినిమాకు ప్రధాన బలం అని హసిత్ గోలీ చెప్పారు.