అగ్రహీరో విజయ్ దేవరకొండ వేగం పెంచారు. వరుసపెట్టి సినిమాలకు సైన్ చేస్తున్నాయన. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఆయన ‘కింగ్డమ్’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటైర్టెన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఆ తర్వాత రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా. ‘రాజావారు రాణీవారు’ ఫేం రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా విజయ్ చేయాల్సివుంది.
అయితే.. ఈ ఇద్దరితోపాటు మరో దర్శకుడి కథను కూడా విజయ్ దేవరకొండ ఓకే చేశారని ఫిల్మ్ వర్గాల్లో టాక్. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. ఇంద్రగంటి మోహనకృష్ణ. గ్రహణం, అష్టాచెమ్మా, జెంటిల్‌మ్యాన్, సమ్మోహనం.. దర్శకునిగా ఇంద్రగంటి పొటెన్షియాలిటీ చెప్పుకోడానికి ఈ నాలుగు సినిమాలు చాలు. రీసెంట్గా విజయ్ దేవరకొండకు ఆయన ఓ కథ వినిపించారట.
ఆ కథ విజయ్‌కి కూడా బాగా నచ్చిందని తెలుస్తున్నది. ప్రస్తుతం బౌండ్ స్క్రిప్ట్‌ని రెడీ చేసే పనిలో ఉన్నదట ఇంద్రగంటి టీమ్. ‘కింగ్డమ్’ సినిమా తర్వాత రాహుల్ సంకృత్యాన్ సినిమా ఉంటుందని తెలుస్తున్నది. ఆ సినిమా తర్వాత రవికిరణ్ కోలా, ఇంద్రగంటి మోహనకృష్ణల్లో ఎవరు ముందు బౌండ్ స్క్రిప్ట్‌తో వస్తే వారి సినిమా విజయ్ చేస్తారని సమాచారం. మరి వారిద్దరిలో విజయ్‌ని డైరెక్ట్ చేసే అవకాశం ముందు ఎవర్ని వరిస్తుందో చూడాలి.