కార్తికేయ ఫ్రాంచైజీ, ప్రేమమ్.. ఇప్పుడు ‘తండేల్’.. దర్శకుడిగా చందూ మొండేటి పొటెన్షియాలిటీ ఏంటో చెప్పడానికి ఈ నాలుగు సినిమాలు చాలు. పొంతన లేని జానర్లలో సినిమాలు తీసి విజయాలు సాధించిన క్రెడిట్ ఆయనది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా, చందూ మొండేటి దర్శకత్వంలో బన్నీవాసు నిర్మించిన ‘తండేల్’ సినిమా ఈ నెల 7న విడుదలై.. వేగంగా వందకోట్ల క్లబ్లో చేరింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో చందూ మొండేటి విలేకరులతో ముచ్చటించారు.
వాస్తవిక సంఘటనలతో కూడిన ఈ కాల్పినిక ప్రేమకథకు ప్రేక్షకుల్లో వస్తున్న స్పందన చూస్తుంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది. మత్య్సలేశం గ్రామస్థులు పాక్ సరిహద్దుల్లో దొరకడం.. వారి పోరాటం.. తదితర విషయాలు తెలుసుకున్నాక, పాక్ నేపథ్యంలో సినిమా చేద్దామనుకున్నా. కానీ ఆలోచిస్తే.. ఇందులో బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంది. ఈ పోరాటానికి ఓ ప్రేమ లేయర్‌ని చుడితే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి పుట్టిందే ‘తండేల్’. ఈ కథలోని ఎడబాటు, విరహం చాలా ప్రత్యేకం. సమకాలీన సమాజంలో లేని ఎడబాటు, విరహం ఈ కథలో ఉన్నాయి. సాంకేతిక పెరిగిన ఈ కాలంలో కూడా ఒక్కసారి సముద్రంలోకి వెళితే నెలరోజుల పాటు కనిపించని, వినిపించని పరిస్థితి. ఈ పాయింట్ ఎక్సయిటింగ్‌గా అనిపించింది. అందుకే తొలినుంచి దీన్ని ఎమోషనల్ లవ్‌స్టోరీ అంటూనే ప్రమోట్ చేశాం.
ఇందులోని ప్రతి షాట్ నా బ్రెయిన్ చైల్డ్. నా అవుట్‌పుట్‌లో ముప్పైశాతం ఎమోషన్ సెన్సార్ కారణంగా తగ్గింది. నా టీమ్ కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. నా ఆలోచనలను దృశ్యమానం చేయడంలో వారి పాత్రే కీలకం. అరవింద్‌గారు, బన్నివాసు, చైతు, సాయిపల్లవి, దేవిశ్రీ.. ఇలా అంతా కలిసి చేసిన కొలాబరేట్ ఎఫర్ట్ ఈ సినిమా. ముఖ్యంగా దేవిశ్రీ ఈ కథను అర్థం చేసుకున్నట్టు ఎవరూ అర్థం చేసుకోలేదు. ప్రతి సన్నివేశానికీ తన మ్యూజిక్‌తో ప్రాణం పోశాడు. నాగార్జునగారు ఈ సినిమా చూసి ‘థ్యాంక్యూ చందు.. వి లవ్ యూ’ అని చెప్పడం, ‘ఇది ఒక దర్శకుడి సినిమా’ అని లెజెండ్రీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు పోస్ట్ పెట్టడం నా జీవితంలో గొప్ప ప్రశంసలు. అందరం ఇంతకష్టడి తీసిన ఈ సినిమాను పైరసీ చేశారు అన్న వార్త విన్నవెంటనే గుండెల్లో గునపం దిగినంత బాధేసింది.
చైతు చాలా సిన్సియర్. ఆయన ఎఫర్ట్ పెట్టి చేశారు కాబట్టే ‘తండేల్’కి ఇన్ని ప్రశంసలు. సెట్లో ఆయనలో గొప్ప నటుడ్ని చూశా. అందుకే.. ‘తెనాలి రామకృష్ణ’ అయనతో చేస్తానని ఆడియన్స్‌కి చెప్పాను. ఆయన ఆ పాత్ర చేయగలడు. తెనాలి రామకృష్ణుడిగా ట్రాన్స్ఫర్మేషన్ కాగలడు. ఒక దర్శకుడిగా, స్నేహితుడిగా ఆయన ఆ పాత్ర చేయాలని నా కోరిక కూడా. త్వరలో సూర్యగారితో సినిమా చేయబోతున్నా. కథ కూడా చెప్పా. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తా. దాని తర్వాత ‘కార్తికేయ 3’ ఉంటుంది.