Suriya | తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు హీరో సూర్య. తమిళ, తెలుగు భాషల్లో తిరుగులేని ఫాలోయింగ్ ఆయన సొంతం. మంచి కథ కుదిరితే స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయాలన్నది తన కల అని సూర్య అనేక ఇంటర్వ్యూల్లో చెప్పారు. త్రివిక్రమ్, పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను వంటి దర్శకులతో సూర్య పనిచేయబోతున్నారని వార్తలొచ్చాయి. అయితే అవన్నీ కార్యరూపం దాల్చలేదు. తాజాగా సూర్య తెలుగు స్ట్రెయిట్ చిత్రానికి ఓకే చెప్పినట్లు తెలిసింది.
‘ప్రేమమ్’ ‘కార్తికేయ-2’ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వంలో సూర్య సినిమా దాదాపు ఖరారైంది. ఈ విషయాన్ని దర్శకుడు చందూ మొండేటి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘కార్తికేయ-2’ సినిమా చూసి సూర్య బాగా ఇంప్రెస్ అయ్యారని, ఇద్దరం కలిసి సినిమా చేద్దామని ఆఫర్ ఇచ్చారని చందూ మొండేటి తెలిపారు.
‘సూర్యకు రెండు కథలు వినిపించా. ఆ రెండూ నచ్చాయని చెప్పారు. అందులో ఒకటి ఫైనల్ చేయాల్సి ఉంది’ అని చందూ మొండేటి పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ ఫిబ్రవరి 7న విడుదలకానుంది. ఈ సినిమా తర్వాత సూర్య సినిమా సెట్స్‌మీదకు వెళ్లే అవకాశం ఉంది.