మంత్ర, మంగళ వంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు దర్శకుడు ఓషో తులసీరామ్. తాజాగా ఆయన మరో మహిళా ప్రధాన చిత్రం ‘దక్షిణ’తో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు. ‘కబాలి’ ఫేమ్ సాయిధన్షిక ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్ను బుధవారం దర్శకుడు బుచ్చిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ఇటీవల కాలంలో తనను బాగా భయపెట్టిన ట్రైలర్ ఇదేనని, సినిమా మేకింగ్ కూడా మరో స్థాయిలో ఉందని ప్రశంసించారు. సైకో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కించామని, ప్రతి సన్నివేశం ఉత్కంఠను పంచుతుందని దర్శకుడు తెలిపారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర నిర్మాత అశోక్ షిండే పేర్కొన్నారు