“వాల్తేరు వీరయ్య’ సినిమాలోని ప్రతీ సీన్లో వినోదం ఉంటుంది. అలాగే అద్భుతమైన భావోద్వేగాలుంటాయి. ఈ పండక్కి రాబోతున్న కలర్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది’ అన్నారు చిత్ర దర్శకుడు బాబీ కొల్లి. చిరంజీవి, రవితేజ కథానాయకులుగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా దర్శకుడు బాబీ శనివారం పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
చిరంజీవి వీరాభిమానిగా 2003లో ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. ఆయన సినిమాకు పనిచేయాలని ఎన్నో కలలు కన్నా. ఇరవై ఏళ్ల నిరీక్షణ తర్వాత నా కల ఫలించింది. నా జీవితంలో మరచిపోలేని సందర్భమిది. ఓ ఫ్యాన్‌బాయ్‌లా ఈ కథ రాసుకున్నా. ఇందులో వింటేజ్ చిరంజీవిని చూస్తారు. కథాపరంగా వాల్తేరు వీరయ్య పాత్రను భిన్న కోణాల్లో ఆవిష్కరించే స్వేచ్ఛ లభించింది. ఆయన లుంగీ కట్టుకోవచ్చు. రౌడీ అల్లుడిలా మాస్ కోణంలో కనిపించవొచ్చు. అలాగే గ్యాంగ్‌లీడర్‌లా గన్ పట్టుకొని యుద్ధానికి రావొచ్చు. ఈ అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. చిరంజీవిగారు డ్యాన్స్‌తో పాటు కామెడీ టైమింగ్‌లో మాస్టర్. ఈ సినిమాలో ఆయన తనదైన శైలి వినోదంతో ఆకట్టుకుంటారు. చిరంజీవిపై ఉన్న ప్రేమాభిమానాలు, నాపై ఉన్న నమ్మకంతో రవితేజ ఈ సినిమాకు ఒప్పుకున్నారు. చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకొని ఎదిగానని రవితేజ చాలా సార్లు చెప్పారు. అందుకే ఫ్యాన్స్ వారిద్దరినీ ఒకేలా ఇష్టపడతారని నమ్మాను.
బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందన్నారు
నేను దర్శకత్వం వహించిన ‘వెంకీ మామ’ షూటింగ్ సమయంలో నాజర్ ఓ పుస్తకం ఇచ్చారు. అందులో వీరయ్య అనే పేరు నన్ను బాగా ఆకట్టుకుంది. అదే టైటిల్‌తో సినిమా చేయాలని అప్పుడే మా టీమ్‌కు చెప్పాను. ఈ సినిమాలో రవితేజ పాత్ర ఏమిటన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది. రవితేజ లేకుండా ‘వాల్తేరు వీరయ్య’ సినిమా లేదని మాత్రం చెప్పగలను. ఫస్ట్‌కాపీ చూసిన తర్వాత చిరంజీవిగారు ‘నాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొడుతున్నావ్’ అన్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమంలో చిరంజీవి నన్ను ఓ తమ్ముడిలా దగ్గరకు తీసుకొని ఆత్మీయంగా ముద్దు పెట్టుకోవడం జీవితంలో మర్చిపోలేను. ఆ ఫొటోని నా ఆఫీసులో, ఇంటిలో ఫ్రేమ్ కట్టించి పెట్టుకున్నా.
గొప్ప అదృష్టంగా భావిస్తున్నా
చిరంజీవి, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్లో మంచి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. ‘వాల్తేరు వీరయ్య’ పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో పైకొచ్చిన చిరంజీవి, రవితేజలతో సినిమా చేయడం గొప్ప అదృష్టంలా భావిస్తున్నా. వారిద్దరికి హిందీలో మంచి మార్కెట్ ఉంది కాబట్టి తెలుగుతో పాటు హిందీలో కూడా ఒకేసారి విడుదల చేస్తున్నాం. ఈ సినిమా సీక్వెల్ గురించి ఇప్పుడేమీ ఆలోచించలేదు. రిలీజైన తర్వాత ప్రేక్షకుల డిమాండ్‌ను బట్టి నిర్ణయం తీసుకుంటాం.