‘ఈ సినిమాలో గోదావరి యాసను చక్కగా పలికాను. అందుకు కారణం దర్శకుడు సజీవ్. అందరూ ఈ సినిమాను రీమేక్ అంటున్నారు. కానీ సినిమా చూస్తే ఒరిజినల్లా ఫీలవుతారు’ అన్నారు తరుణ్‌భాస్కర్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్డూడియోస్ సంస్థలు నిర్మించాయి. సోమవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు.
ఈ సందర్భంగా తరుణ్‌భాస్కర్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు రియల్ హీరో ఈషా రెబ్బానేనని, శాంతి పాత్రలో ఆమె సినిమాకు ప్రాణం పోశారన్నారు. ఓంకార్ నాయుడు పాత్రలో తరుణ్‌భాస్కర్ గుర్తుండిపోతారని, ప్రతీ సన్నివేశం కొత్తగా అనిపిస్తుందని దర్శకుడు సజీవ్ చెప్పారు. తాను పోషించిన శాంతి క్యారెక్టర్‌తో ప్రతీ అమ్మాయి కనెక్ట్ అవుతుందని ఈషా రెబ్బా తెలిపింది. ఇంటింటి రామాయణంలాంటి సినిమా ఇదని, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదని నిర్మాత సృజన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో విశ్వక్సేన్, ప్రియదర్శి తదితరులతో పాటు చిత్రబృందమంతా పాల్గొన్నారు.