Anil Ravipudi | టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం సంక్రాంతి బరిలో నిలిచి రూ. 360 కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ భారీ విజయం పట్ల కృతజ్ఞతగా స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి ఆయన తిరుమల వచ్చారు.
శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన అనిల్ రావిపూడి తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన నెక్స్ట్ మూవీపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, మరో 10 నుంచి 15 రోజుల్లో అధికారికంగా అప్డేట్ ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం, అనిల్ తన తదుపరి చిత్రాన్ని విక్టరీ వెంకటేష్‌తో చేసే అవకాశం ఉంది. ఇది ఒక భారీ మల్టీస్టారర్ అని, ఇందులో తమిళ స్టార్ కార్తీ లేదా మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ నటించే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ చిత్రాలే అందించిన అనిల్, ఈసారి పూర్తిగా కొత్త జానర్లో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ వేగంగా జరుగుతోంది.