‘దర్శకుడిగా నాకిది కీలకమైన సమయం. రెండు భారీ హిట్స్ తర్వాత చేయబోయే సినిమా అంటే ఓ రకమైన తికమక ఉంటుంది. అందుకే వారం రోజులు విశ్రాంతి తీసుకొని ఈ మధ్యే ఓ స్టోరీలైన్‌ను ఫిక్స్ చేశాను. జూన్ లేదా జూలైలో సినిమా ప్రారంభమవుతుంది. అది కూడా మంచి ఎంటర్టైనరే’ అన్నారు అగ్ర దర్శకుడు అనిల్ రావిపూడి. ఇటీవలే చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్‌గారు’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించి ద్విగుణీకృతమైన ఉత్సాహంతో ఉన్నారాయన. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి గురువారం విలేకరులతో ముచ్చటిస్తూ ఆసక్తికరమైన విషయాల్ని పంచుకున్నారు.
నా తదుపరి సినిమా కూడా సంక్రాంతికే వస్తుంది. ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు (నవ్వుతూ). ఆ సినిమా టైటిల్ ప్రకటన దగ్గరి నుంచి ప్రతీది ఇంట్రెస్టింగ్ జర్నీలా అనిపిస్తుంది. సినిమా టైటిలే విచిత్రంగా ఉంటుంది. కచ్చితంగా మరో మేజిక్ జరగబోతుందనే నమ్మకం ఉంది.
ప్రస్తుతం ప్రేక్షకులు వినోదాన్ని కోరుకుంటున్నారు. నా తర్వాతి సినిమా కూడా 200 శాతం ఎంటర్టైనరే. అయితే ఎంత వినోదాన్ని జోడించినా అంతర్లీనంగా మాత్రం ఎమోషన్స్ మిస్ చేయను. ప్రస్తుతానికైతే ప్రయోగాల జోలికి పోవాలనుకోవడం లేదు. వినోదప్రధానంగానే ప్రతి సినిమాలో కొత్త కథను చూపించే ప్రయత్నం చేస్తా.
చిరంజీవితో పనిచేయడం ఓ జీవితకాల అనుభవం. చిరంజీవి, వెంకటేష్.. ఇద్దరు సూపర్స్టార్స్నూ చూస్తూ పెరిగాను. వారిని డెరెక్ట్ చేయడంతో నా చిరకాల స్వప్నం నిజమైంది. సినిమా టైటిల్ ఎండ్ కార్డ్స్‌లో వచ్చే పాటలో వారిద్దరితో కలిసి డ్యాన్స్ చేయడం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
దర్శకుడిగా వరుస విజయాలతో తనను రాజమౌళితో పోల్చడంపై అనిల్ రావిపూడి స్పందిస్తూ ‘అసలు అలాంటి పోలికే వద్దు. రాజమౌళిగారు ఎంతో ఎత్తులో ఉన్నారు. ఆయన చేసే సినిమాలు వేరు..నా సినిమాలు వేరు. నేను ఇప్పుడే ప్రయణాన్ని మొదలుపెట్టా. ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. భవిష్యత్తులో తప్పకుండా చిరంజీవితో మరో సినిమా చేస్తా. ఓ దర్శకుడిగా థియేటర్లలో ప్రేక్షకుల చిరునవ్వులే నాకు ఎనర్జీనిస్తాయి. వారిని మరిన్ని మంచి కథలతో అలరించడమే లక్ష్యంగా పెట్టుకున్నా.