బాలీవుడ్ ఐకానిక్ చిత్రం.. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే! ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచన ఏమాత్రం లేదని అంటున్నది అగ్రతార కాజోల్. రాజ్-సిమ్రన్ కథను కొనసాగించకపోవడమే మంచిదని అంటున్నది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజోల్.. ‘దిల్వాలే దుల్హనియా లే జాయేంగే’ సినిమా సీక్వెల్‌పై తన అభిప్రాయాన్ని పంచుకున్నది. “డీడీఎల్జే-2ని ఊహించలేను. రైల్వే స్టేషన్ నుంచి రైలు బయల్దేరిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఎవరూ ఉత్సాహం చూపించడం లేదు. రాజ్-సిమ్రన్.. తమ పిల్లల డైపర్ల కోసం గొడవ పడటం కూడా చూడాలని అనుకోవడం లేదు. అందుకే.. మేము కూడా ఈ ఐకానిక్ సినిమాకు సీక్వెల్‌ను తీసుకురావాలని అనుకోవడం లేదు” అంటూ చెప్పుకొచ్చింది. “నిజానికి.. ఆ సినిమా క్లయిమాక్స్ అద్భుతంగా ఉంటుంది.
ఆ ప్రేమజంట జీవితం ఎలా ఉంటుందో.. ప్రేక్షకుల ఊహకే వదిలేశాడు దర్శకుడు. ప్రేక్షకులు కూడా.. వాళ్లు ఎప్పటికీ సంతోషంగా జీవిస్తారనే కోరుకుంటారు” అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇక తాను షారుక్‌తో కలిసి నటించిన మరో బ్లాక్‌బస్టర్ సినిమా.. ‘కుచ్ కుచ్ హోతా హై’ సీక్వెల్‌పైనా స్పందించింది. “ఆకాలం వేరు. ప్రజలంతా శాశ్వతమైన ప్రేమను నమ్మిన యుగం అది. నేటికాలంలో అలాంటి సినిమాను తిరిగి సృష్టించడం చాలా కష్టం” అని చెప్పింది. షారుక్ ఖాన్ – కాజోల్ జంటగా 1995లో వచ్చిన దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా.. బాలీవుడ్ ఎవర్గ్రీన్ లవ్‌స్టోరీల్లో ఒకటిగా నిలిచింది.
రన్నింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. 1995 అక్టోబర్ 20న విడుదలైన ఈ చిత్రం.. ముంబైలోని ‘మరాఠా మందిర్ థియేటర్’లో ఇప్పటికీ ప్రదర్శితమవుతూనే ఉండటం విశేషం! ప్రఖ్యాత దర్శక నిర్మాత యశ్ చోప్రా తనయుడు ఆదిత్య చోప్రా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక కాజోల్ సినిమాల విషయానికి వస్తే.. ఆమె నటించిన హర్రర్ చిత్రం ‘మా’ విడుదలకు సిద్ధంగా ఉంది. విశాల్ ఫురియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. రోనిత్ రాయ్, ఇంద్రనీల్ సేన్‌గుప్తా, ఖేరిన్ శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.