‘క్రిస్మస్కు విడుదలైన చిత్రాల్లో ‘శంబాల’ మంచి సక్సెస్ సాధించడం చాలా గ్రేట్. ఈ సినిమా ప్రోమో చూసినప్పుడే విజయం సాధిస్తుందని చెప్పాను. ఇప్పుడు అదే మాట నిజమైంది’ అన్నారు అగ్ర నిర్మాత దిల్రాజు. మంగళవారం జరిగిన ‘శంబాల’ థాంక్స్మీట్కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు. ఆది కథానాయకుడిగా యుగంధర్ ముని దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా విడుదలై విజయపథంలో పయనిస్తున్నది. ఈ సందర్భంగా దిల్రాజు మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు.
కొడుకు సక్సెస్ కోసం తండ్రి పడే తపన మాటల్లో చెప్పలేమని, ఈ సినిమా విషయంలో సాయికుమార్ టీమ్ మొత్తానికి వెన్నెముకలా నిలిచారని , తన కుమారుడి విజయాన్ని ఆయన ఆస్వాదిస్తున్నారని దిల్ రాజు అన్నారు. ఈ సినిమా విజయంతో కెరీర్ను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని మంచి చిత్రాల్ని చేస్తానని ఆది సాయికుమార్ పేర్కొన్నారు. మంచి కంటెంట్ ఎప్పుడూ గెలుస్తుందని ఈ సినిమా విజయం నిరూపించిందని సాయికుమార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.