Dil Raju | తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేయాలని సినీ ఎగ్జిబిటర్లు నిర్ణయించారని తెలిసిందే. రెంటల్ బేసిస్‌లో (అద్దె ప్రాతిపదిక) సినిమాలు ప్రదర్శించలేకపోవడంతో ఎగ్జిబిటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమకు పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు.
ఈ వివాదం నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఐక్యత లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో ఎవరి దారి వాళ్లదేనని.. అందరం కూర్చొని మాట్లాడితే ఎలాంటి వివాదం ఉండదన్నారు. పేరుకే పెద్దలం.. కానీ అందరం కూర్చొని మాట్లాడాలంటే భయం. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అనే వార్త తొలి రోజు నుంచీ తప్పే. దాన్ని ఛాంబర్, ఎగ్జిబిటర్లు ఖండించకపోవడం వల్లే అంతా జరిగిందన్నారు.
పవన్ కల్యాణ్ ఇండస్ట్రీకి మంచి ప్రోత్సాహం ఇచ్చారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో నిర్మాతలం బాగుపడుతున్నామని పేర్కొన్నారు. ఎవరికివాళ్లు సొంత లాభం చూసుకుంటున్నారు తప్ప అందరూ కలవడం లేదన్నారు. రెండు ప్రభుత్వాలు ఇండస్ట్రీతో బాగున్నాయి. కానీ ప్రభుత్వాలతో మాట్లాడే ఐక్యత తమలోనే లేదంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు. ఇప్పుడీ కామెంట్స్ ఇండస్ట్రీ సర్కిల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.