Kandula Durgesh | జూన్ 1 నుండి థియేటర్స్ బంద్ చేస్తామంటూ ఇటీవల జరిగిన ప్రచారం సమయంలో ఏపీ సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ విచారణకి ఆదేశించిన విషయం తెలిసిందే. సరిగ్గా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్‌కి ముందే థియేటర్స్ బంద్ చేయాలని ఆ నలుగురు కుట్ర చేశారంటూ జనసేన తీవ్రంగా ఆరోపించిన నేపథ్యంలో విచారణకి ఆదేశించారు. అయితే తాజాగా కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పర్యాటక, సాంస్కృతిక, సినిమా రంగాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ దిశగా స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతామని చెప్పుకొచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి, రాష్ట్రంలో సినిమా నిర్మాణ కార్యకలాపాలు పెంచేందుకు మా నుండి అన్ని సహయ సహకారాలు అందిస్తామని దుర్గేష్ అన్నారు.
సినిమా షూటింగ్‌లకు అనుమతులు సులభతరం చేయడం, సింగిల్ విండో విధానాన్ని మరింత పటిష్టం చేయడం, అలాగే రాష్ట్రంలో ఫిల్మ్ సిటీ నిర్మాణానికి సంబంధించిన అవకాశాలను పరిశీలిస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. టిక్కెట్ రేట్స్‌పై దశాబ్ధకాలంగా వివాదం నడుస్తుంది. అయితే నిర్మాతలు టిక్కెట్ రేట్స్ పెంచమని కోరినప్పుడు పెంచుతామని తెలియజేశారు. ఇక టికెట్‌పై రూపాయి పెంచితే ప్రభుత్వానికి పావలా వస్తుందని ఆయన అన్నారు.గతంలో సినిమా రంగానికి చెందిన వ్యక్తులు వేధింపులకి గురైన విషయం నిజం కాదా అని ప్రశ్నించారు.
మా ప్రభుత్వం వచ్చాక సినిమా పరిశ్రమకి అండగా నిలుస్తున్నాం. తెలుగు సినిమా పరిశ్రమ మన రాష్ట్రానికి గర్వకారణం, దానికి తగిన ప్రోత్సాహం అందించడం మా బాధ్యత అని ఆయన అన్నారు. ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ సినిమా సమయంలోనే ఇలాంటి వివాదాలు సృష్టిస్తుంటారు. వీరమల్లు ఫ్లాప్ అంటూ పేర్ని నాని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. రిలీజ్‌కి ముందే బాధ్యత లేని మాటలు మాట్లాడుతున్నాడు. ఆయనకి మానవత్వం కూడా లేదు. వల్లభనేని వంశీ మరణంతో రాజకీయ ప్రయోజనం ఆశిస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు దుర్గేష్.