Dil Raju | థియేటర్ల బంద్ వ్యవహారంపై నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా కాకుండా ఫిలిం ఛాంబర్ ద్వారా సంప్రదించాలన్న సూచన ఫిల్మ్ ఇండస్ట్రీకి శాశ్వత దిశ ఇస్తుందని పేర్కొన్నారు. అందుకే చిత్ర పరిశ్రమ ప్రభుత్వాలతో కలిసి ముందుకు సాగాలన్నారు. ఈ దిశలో తొలి అడుగు వేసిన పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. సగటు సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడంపై పవన్ కల్యాణ్ ఆలోచనలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానన్నారు. హాల్స్‌లో తినుబండారాలు, పానీయాల ధరలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న అభిప్రాయం అభినందనీయమన్నారు. ఈ విషయంలో అందరూ స్వాగతించి కలసికట్టుగా ముందుకు సాగుదామని దిల్ రాజు పిలుపునిచ్చారు.
థియేటర్ల నుంచి ఓటీటీ వేదికలపైకి సినిమాలు త్వరగా వెళ్తుండడంపై ప్రేక్షకులు ఓటీటీ వైపునకు మొగ్గుచూపుతున్నారని.. సినిమా ఎంతకాలం ఓటీటీకి వెళ్లాలనే దానిపై సైతం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రేక్షకుడికి బిగ్స్క్రీన్పై సినిమా చూసే అనుభూతిని అర్థవంతంగా తెలియజేయడం మనందరి బాధ్యత అన్న దిల్ రాజు.. థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడానికి మరో ముఖ్యమైన కారణం పైరసీ అని తెలిపారు. అందరూ కలసికట్టుగా పైరసీపై పోరాడితేనే ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు రప్పించగలుగుతామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం సూచించిన అన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతోనూ సంప్రదింపులు జరుపాలని సూచించారు. తెలుగు సినిమా అభివృద్ధికి నిర్మాతల మండలి నుంచి కలసికట్టుగా సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు.
ఇదిలా ఉండగా.. ఏపీలో సినిమా థియేటర్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఈ దిశగా ఆయాశాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కొత్త చిత్రాల విడుదల సమయంలో టికెట్ ధరల పెంపు కోసం నిర్మాతలు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, సినిమా హాళ్ల బంద్ ప్రకటనలు, తమశాఖ ద్వారా చేపట్టిన చర్యలు, తాజా పరిణామాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు వివరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పలు కీలక సూచనలు చేశారు. టికెట్ ధరల పెంపు, సినిమా హాళ్ల నిర్వహణ ఇలా ఏ విషయంలోనైనా ప్రభుత్వ శాఖలు తమ విధులను పకడ్బందీగా చేయాలన్నారు. త్వరలో విడుదలయ్యే తన సొంత చిత్రం ‘హరిహర వీరమల్లు’ సినిమాకు సైతం టికెట్ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వానికి అర్జీ ఇచ్చి సంప్రదింపులు చేయాలని, ఇందులో తనమన బేధాలు పాటించవద్దని ఆదేశించారు.
Deputy CM Pawan Kalyan | సినిమా హాళ్ల నిర్వహణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు