కొరియోగ్రాఫర్ యష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఆకాశం దాటి వస్తావా’. శశికుమార్ దర్శకుడు. నిర్మాత శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించింది చిత్రబృందం. ఈ సందర్భంగా ‘దిల్’రాజు మాట్లాడుతూ ‘ఇదొక మ్యూజికల్ మూవీ. కొత్త టాలెంటను పరిచయం చేయాలనే ఈ సంస్థలో శశి,యష్‌లతో ఈ ప్రయత్నం చేస్తున్నాం.
నేటి యువతరాన్ని ఆకట్టుకునే అంశాలతో రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ఇది’ అన్నారు. దర్శకుడు శశి మాట్లాడుతూ ‘జీవితంలో ప్రేమ, టైమ్, డబ్బులకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ మూడింటిలో ఏది తగ్గినా ఆ రిలేషన్లో గొడవలు జరుగుతాయి. ఇదే సినిమా నేపథ్యం. కథ వినగానే నిర్మాతకు నచ్చడంతో సినిమా సెట్స్‌పైకి వచ్చింది. ఇదొక మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం’ అన్నారు. తనకు ఇప్పటికి ఇదొక కలలా వుందని హీరో యష్ తెలిపారు.