Dil Raju | టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సినిమాలకు టికెట్ల ధరలను పెంచబోమనని స్పష్టం చేశారు. తమ్ముడు చిత్రానికి ధరలు పెంచమని ప్రభుత్వాలను అడుగబోనన్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై పవన్ కల్యాణ్ సూచనలు చేశారన్నారు. పవన్ తనకు ఆదర్శమని.. ఆయన సూచనలు అనుసరిస్తానన్నారు. డిప్యూటీ సీఎం పవన్ సూచనలను తప్పకుండా నిర్మాతలు అందరూ పాటించాలని సూచించారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం నిర్మాతల బాధ్యత అన్నారు. టికెట్ల ధరలు, తినుబండారాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలన్నారు. ఇకపై తెలంగాణలో టికెట్ల ధరలు పెంచడం ఉండదన్నారు. తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం భేటీలోనూ ఈ విషయంపై చర్చించామన్నారు. పవన్ సూచనలపై తెలంగాణ ప్రభుత్వానికి సైతం ప్రతిపాదించినట్లు వివరించారు.
ఇదిలా ఉండగా.. తమ్ముడు మూవీ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలోనూ దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ట్రైలర్, టీజర్‌కు వచ్చే వ్యూస్‌ను కొనుగోలు చేయాలని అనుకోవడం లేదని.. ప్రేక్షకులు ఎంతవరకు నచ్చితే అంతవరకే చూస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ్ముడు మూవీ నుంచే ఈ పద్ధతికి నాంది పలుకుతున్నానన్నారు. యూట్యూబ్‌లో ట్రైలర్ రిలీజ్ చేశాక వచ్చే నెంబర్ అన్నీ ఇకపై ఒరిజినల్. ప్రేక్షకులు చూసే అంకెలు మాత్రమే ఉండాలని కార్యాలయంలో ఖరాకండీగా చెప్పానని రిల్ రాజు చెప్పారు. బిలియన్స్, మిలియన్స్ డబ్బులు పోసి కొనొద్దని.. ఒరిజినల్ సినిమా ట్రైలర్, సాంగ్ ఎంత రీచ్ అవుతుందో మనకు తెలిస్తేనే సినిమా ప్రేక్షకులకు ఎంత రీచ్ అవుతుందో తెలుస్తుందని.. కొని ఇచ్చే నెంబర్‌తో ప్రేక్షకుడికి రీచ్ అయ్యిందా..? లేదా? తెలియడం లేదన్నారు.
కొంచెం కష్టమైనా.. ఈ విషయంలో తానే తొలి అడుగు వేశానని.. తాను ఎవరిని ఉద్దేశించి అనడం లేదన్నారు. నిజంగా సినిమా ఎలా రీచ్ అవుతుందనేది తెలిసినప్పుడు ఏది రీచ్ అవుతుంది.. అవడం లేదో తెలుస్తుందని.. అవ్వకపోతే ఏం చేయాలి..? అనేది తెలుస్తుందని చెప్పారు. దానికో అవేర్నెస్ ఉండాలని.. దాని కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. సినిమాలో విషయం ఉంటే రీచ్ అవుతుందని.. లేకపోతే ప్రేక్షకులే తిరస్కరిస్తారన్నారు. దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని.. అందుకే వ్యూస్‌ని కొనొద్దని చెప్పానన్నారు. మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు అభిమానిస్తారని.. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఇది రుజువైందని దిల్ రాజు పేర్కొన్నారు.