Dil Raju | ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొడక్ట్ కంపెనీని ప్రారంభించారు. క్వాంటమ్ ఏఐ గ్లోబల్ సంస్థతో కలిసి ఆయన ఈ సంస్థకు శ్రీకారం చుట్టారు. ఈ కంపెనీ సినిమాలు, వినోదరంగం కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి స్మార్ట్ టూల్స్‌ను తయారు చేస్తుంది. వీటి ద్వారా కంటెంట్ క్రియేటర్స్, స్టూడియోలు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లకు సహాయం చేయడం, స్క్రిప్ట్ డెవలప్మెంట్, ప్రీ విజువలైజేషన్, ఎడిటింగ్ వంటి సృజనాత్మక ప్రక్రియల్లో మద్దతును అందిస్తుంది.
ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ‘ఇది కేవలం కంటెంట్ క్రియేషన్ గురించే కాదు. యావత్ ఎంటర్టైన్మెంట్ ప్రపంచానికి మద్దుతునిచ్చే బలమైన ఏఐ వ్యవస్థ నిర్మాణంపై దృష్టి పెడుతుంది. క్వాంటమ్ ఏఐ గ్లోబల్‌తో కలిసి వినోదరంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకురావాలన్నదే మా లక్ష్యం’అన్నారు. ఈ కంపెనీ పేరు, ఇతర వివరాలను మే 4న వెల్లడించనున్నారు.