రామ్‌చరణ్ ‘గేమ్‌ఛేంజర్’ సినిమాను విశేషాల సమాహారంగా చెప్పుకోవచ్చు. నేడు వస్తున్న సినిమాలకు ఇది పూర్తి భిన్నమైన సినిమా అని తెలుస్తున్నది. సమకాలీన రాజకీయ అంశాలను ప్రస్తావించడమే కాకుండా, వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతూ, సామాన్యుడికి బతుకుపై అవగాహన పెంచేలా ఈ సినిమా కథ, కథనం, సన్నివేశాలు ఉంటాయని సమాచారం. శంకర్ గత చిత్రాలైన జెంటిల్‌మేన్, భారతీయు, ఒకేఒక్కడు, అపరిచితుడు చిత్రాల కోవలో సందేశాత్మక కథాంశంతో ఈ సినిమా రానుంది.
ఇక హీరోయిజం కూడా శంకర్ గత విజయాల మాదిరిగానే నెక్ట్స్ లెవల్లో ఉంటుందని టాక్. ఇందులో రామ్‌చరణ్ తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో నటించనున్న విషయం తెలిసిందే. అయితే రెండు పాత్రల్లోనూ ఆయన యంగ్‌గానే కనిపిస్తారట. ఈ రెండు పాత్రల్లో తండ్రి పాత్రే సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని విశ్వసనీయ సమాచారం. ఆ పాత్ర తీరుతెన్నులు, ఆహార్యం, డైలాగ్ డిక్షన్ పూర్తి విభిన్నంగా ఉంటాయని సమాచారం. కియారా అద్వానీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ఎస్.జె.సూర్య, సునీల్ తదితరులు ఇతర పాత్రధారులు. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా విడుదలచేయడానికి నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు.