Dhruv Rathee on Dhurandhar Film | సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదరణ కలిగిన యూట్యూబర్ ధ్రువ్ రాఠీ (Dhruv Rathee) మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల థియేటర్లలో విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్’ (Dhurandhar) గురించి ఆయన చేసిన విశ్లేషణ ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా వాస్తవాలను వక్రీకరించిందని, బీజేపీ రాజకీయ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికే దీనిని రూపొందించారని ఆయన ఆరోపించారు.
తన తాజా వీడియోలో ధ్రువ్ రాఠీ మాట్లాడుతూ.. సినిమాలో చూపించిన అనేక అంశాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. చారిత్రక సంఘటనలను లేదా వర్తమాన రాజకీయ పరిణామాలను సినిమాటిక్ లిబర్టీ పేరుతో తప్పుగా చూపించడం సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా యువతను తప్పుదోవ పట్టించేలా ఈ చిత్రంలోని సన్నివేశాలు ఉన్నాయని ఇది కేవలం సినిమా కాదని, ఒక పక్కా పొలిటికల్ ప్రొపాగాండా అని ఆయన విమర్శించారు. మరోవైపు ఈ సినిమా చిత్ర బృందం, కొంతమంది నెటిజన్లు ధ్రువ్ రాఠీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. సినిమాను కేవలం సినిమాగానే చూడాలని, దాని వెనుక రాజకీయాలను వెతకడం సరికాదని వారు వాదిస్తున్నారు. గతంలో కూడా ‘ది కేరళ స్టోరీ’, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ వంటి చిత్రాల విషయంలో కూడా ధ్రువ్ రాఠీ ఇలాంటి విమర్శలే చేశారు. ప్రస్తుతం ‘ధురంధర్’ సినిమాపై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య పెద్ద చర్చకే దారితీశాయి.