Dhurandhar | రణ్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్ల వసూళ్లను దాటేసి, ఈ ఏడాది అతిపెద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్‌పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసల జల్లు కురిపించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆర్జీవీ, ఆదిత్య ధర్, నీవు భారతీయ సినిమా భవిష్యత్తును మార్చేశావు. నీ దర్శకత్వం నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయిఅంటూ ఆయనను ఆకాశానికెత్తేశారు. ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
ఆర్జీవీ ట్వీట్‌కు ఆదిత్య ధర్ భావోద్వేగంగా స్పందించారు. నా అభిమాన దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ ఒకరు. భయం అంటే ఏమిటో తెలియకుండా సినిమా తీయడం మీ నుంచే నేర్చుకున్నాను. ‘ధురంధర్’ తెరకెక్కిస్తున్న సమయంలో మీ ప్రభావం నాపై చాలా ఉంది. మీ సినిమాలు కొన్నిసార్లు నా తలలో గుసగుసలాడేవి, మరికొన్ని సార్లు గట్టిగా అరిచేవి” అంటూ ఆయన పేర్కొన్నారు. ఈ ట్వీట్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఆదిత్య ధర్ వ్యాఖ్యలకు తిరిగి స్పందించిన రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అప్పట్లో అవి రిస్కులు అని నాకు తెలియదు. నా అజ్ఞానంతో నాకు తోచినవి చేశాను. సినిమా హిట్ అయితే దూరదృష్టి అంటారు, ఫెయిల్ అయితే కళ్లు లేవు అంటారు అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు దర్శకుల మధ్య జరిగిన ఈ ట్విట్టర్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక తరం దర్శకుడు మరో తరం దర్శకుడి ప్రతిభను గుర్తించి ప్రశంసించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ధురంధర్’ విజయంతో పాటు ఆర్జీవీ–ఆదిత్య ధర్ మధ్య జరిగిన ఈ సంభాషణ కూడా సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తానికి ‘ధురంధర్’ కేవలం బాక్సాఫీస్ వద్దే కాదు, దర్శకుల మధ్య గౌరవాభిమానాలను కూడా తెరపైకి తెచ్చిన సినిమాగా నిలిచిందని చెప్పొచ్చు.