Dhurandhar Collection | బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో దూసుకుపోతోంది. రిలీజ్ అయిన వారం రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన ఈ సినిమా తాజాగా మరో కీలక రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటివరకు సినిమా విడుదలైన తర్వాత రెండో శుక్రవారం అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘ధురంధర్’ నిలిచింది. ఈ నెల 5న విడుదలైన సినిమా, రెండో శుక్రవారం అయిన 12న రూ.34.70 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.ఇంతకుముందు ఈ రికార్డు ‘పుష్ప 2’ (హిందీ వెర్షన్) పేరిట ఉండేది. ఆ సినిమా రెండో శుక్రవారం రూ.27.50 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఆ రికార్డును ‘ధురంధర్’ బద్దలు కొట్టింది. ఈ లిస్టులో తరువాత స్థానాల్లో ఛావా (రూ.24.30 కోట్లు), యానిమల్ (రూ.23.53 కోట్లు) ఉన్నాయి.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘ధురంధర్’ ఇప్పటివరకు భారతదేశంలో రూ.252 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. వరల్డ్ వైడ్‌గా చూస్తే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. సినిమా ఇంకా థియేటర్లలో బలంగా నడుస్తుండటంతో, ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్లో రైడ్ 2, రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ, సికందర్ వంటి సినిమాల లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను ‘ధురంధర్’ దాటేసిందని సమాచారం. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, దాదాపు 17 ఏళ్ల తర్వాత బాలీవుడ్లో అత్యధిక రన్‌టైమ్ ఉన్న సినిమాగా కూడా గుర్తింపు పొందింది.
మరోవైపు, ఈ సినిమాను బహ్రెయిన్, ఒమన్, కువైట్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ వంటి కొన్ని గల్ఫ్ దేశాల్లో విడుదల చేయలేకపోయారని సమాచారం. అక్కడ బ్యాన్ విధించారనే ప్రచారం కూడా సాగుతోంది. ఈ మూవీలో రణవీర్ సింగ్‌తో పాటు మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, రాకేశ్ బేడీ, సారా అర్జున్, సౌమ్య టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కథ ఏంటంటే? .. 1999 విమాన హైజాక్, 2001 భారత పార్లమెంట్‌పై ఉగ్ర దాడుల తర్వాత… భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్) ఓ సీక్రెట్ నిర్ణయం తీసుకుంటాడు. దాయాది దేశం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలను సమూలంగా నాశనం చేయాలనే లక్ష్యంతో ‘ఆపరేషన్ ధురంధర్’ అనే రహస్య మిషన్‌ను ప్లాన్ చేస్తాడు. ఈ మిషన్ కోసం పంజాబ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ యువకుడిని హమ్జా (రణవీర్ సింగ్) అనే పేరు మీద భారత ఏజెంట్‌గా పాక్‌లోకి పంపిస్తాడు. అక్కడ అతడు ఎదుర్కొన్న ప్రమాదాలు, ఉగ్ర స్థావరాల ధ్వంసం కోసం చేసిన సాహసాలు, ఉగ్రవాద ముఠాలకు వెన్నెముకగా ఉన్న రెహమాన్ బలోచ్ (అక్షయ్ ఖన్నా) ను హమ్జా ఎలా అంతం చేశాడన్నదే ఈ సినిమాకథ.