Dhurandhar Movie | బాలీవుడ్ సినిమా ధురంధర్ విడుదలై నెల దాటుతున్న ఇంకా హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రూ.1300 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం తాజాగా మరో రికార్డును అందుకుంది. గత 9 ఏండ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఎస్.ఎస్. రాజమౌళి ‘బాహుబలి 2’ రికార్డును ధురంధర్ తాజాగా అధిగమించింది. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా 20.7 మిలియన్ డాలర్లతో ‘బాహుబలి 2’ అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడు ‘ధురంధర్’ 21 మిలియన్ డాలర్ల మార్కును దాటి అగ్రపీఠాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో కల్కి 2898 ఏడీ (18.5M), పఠాన్ (17.5M), జవాన్ (15.6M) వంటి భారీ చిత్రాలను ఇది వెనక్కి నెట్టింది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాల సందడి నెలకొన్నప్పటికీ, ఉత్తరాదిలో ఈ సినిమా ప్రభంజనం ఏమాత్రం తగ్గలేదు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 863 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. గత ఐదు రోజుల్లోనే దాదాపు రూ. 22 కోట్లకు పైగా వసూళ్లు రావడం ఈ సినిమా సత్తాను చాటుతోంది. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్ వంటి హేమాహేమీలు నటించిన ఈ చిత్రం అటు ఆస్ట్రేలియా మార్కెట్లోనూ సత్తా చాటుతోంది. వచ్చే వారం ‘బోర్డర్ 2’ విడుదలయ్యే వరకు ఈ జోరు ఇలాగే కొనసాగే అవకాశం కనిపిస్తోంది.