Dhurandhar 2 | భారతీయ సినీ పరిశ్రమలో ధురంధర్ 2 సృష్టిస్తున్న కలెక్షన్స్ ప్రభంజనం ఆగడం లేదు. రెండో వారాంతంలోనూ ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ముఖ్యంగా 11వ రోజు (మార్చి 29) సాధించిన వసూళ్లు ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేశాయి. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. వారి కాంబినేషన్ ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టిస్తోంది. తాజా లెక్కల ప్రకారం, 11వ రోజునే ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ. 69.10 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. దీంతో ఇండియాలో మొత్తం గ్రాస్ కలెక్షన్స్ రూ. 1,013.15 కోట్లకు చేరుకున్నాయి. నెట్ పరంగా చూస్తే రూ. 847.87 కోట్లతో ఈ చిత్రం దూసుకుపోతోంది.
అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఈ సినిమా తన దూకుడు కొనసాగిస్తోంది. ఓవర్సీస్లో ఇప్పటికే రూ. 350 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 1,363.15 కోట్ల గ్రాస్‌ను సాధించింది. గతంలో విడుదలైన మొదటి భాగం ధురంధర్ లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను ఈ సీక్వెల్ కేవలం 11 రోజుల్లోనే దాటేయడం విశేషం. ఈ సినిమా విజయంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. “ఆదిత్య ధర్ ఫిల్మ్ ఇండస్ట్రీ కింద అణుబాంబు పేల్చారు” అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక సినిమా విజయోత్సాహంలో భాగంగా రణ్వీర్ సింగ్, షారుఖ్ ఖాన్ ముంబైలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్లో కలిసి కనిపించారు. వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
భాషల వారీగా 11వ రోజు వసూళ్లు చూస్తే.. హిందీ: రూ. 17.31 కోట్లు (45% ఆక్యుపెన్సీ), తెలుగు: రూ. 60 లక్షలు, తమిళం: రూ. 25 లక్షలుగా ఉంది. ఇక ఈ సినిమా దూకుడుతో అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘భూత్ బంగ్లా’ విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ జోరు చూస్తుంటే, బాహుబలి 2 రికార్డులను కూడా సవాల్ చేసే స్థాయికి చేరుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కలెక్షన్స్ రన్ ఎక్కడ ఆగుతుందో చూడాలి.