‘ ‘బైసన్’ నాకెంతో ప్రత్యేకమైన సినిమా. మా నాన్న విక్రమ్ నేపథ్యం లేకుండా వచ్చి, కష్టపడి ఈ స్థాయికి ఎదిగారు. కానీ నేను అలా కాదు. విక్రమ్ కొడుకుగా నాకు అన్నీ సులభంగా అందాయి. కానీ ఆయనలా అందరి ప్రేమను సంపాదించడం తేలిక్కాదు. ఆ ప్రయత్నంలో భాగమే ‘బైసన్’. నాన్నగారి లాగే కష్టపడి వందశాతం ఎఫర్ట్ పెట్టి ఈ సినిమా చేశాను. అర్జున్ అవార్డు గ్రహీత మణతి గణేశన్ కథ ఆధారంగా దర్శకుడు మారి సెల్వరాజ్ తెరకెక్కించిన సినిమా ఇది. తెలుగులో ఈ సినిమాను అందరూ చూడాలని కోరుకుంటున్నా.’ అని హీరో ధృవ్ విక్రమ్ అన్నారు.
ఆయన హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘బైసన్’ అదే పేరుతో తెలుగులో విడుదల కానున్నది. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. మారి సెల్వరాజ్ దర్శకుడు. సమీర్ నాయర్, దీపక్ సెగల్, పా.రంజిత్ అదితి ఆనంద్ నిర్మాతలు. జగదంబే ఫిల్మ్స్‌వారు ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ నెల 24న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో ధృవ్ విక్రమ్ మాట్లాడారు. ధృవ్‌తో నటించడం ఆనందంగా ఉందని, తమిళంలో మంచి విజయం సాధించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని నటి అనుపమ మరమేశ్వరన్ చెప్పారు.