‘తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఈ అనుబంధం వల్ల కథానాయిక జీవితంలో ఏర్పడిన ఒడిదుడుకుల్ని హీరో ఎలా సరిదిద్దాడు అనేది కథ. ఇది మంచి ప్రేమకథ కూడా. కథ రిత్యా విదేశాల్లో షూటింగ్ జరగాలి. అందుకే పోలెండ్‌ని ఎంచుకున్నాం. ఇంటర్వెల్ దాకా మంచి సాంగ్స్, లవ్ ట్రాక్‌తో కథ సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్ తర్వాత కథ కీలకమలుపు తీసుకుంటుంది. అదేంటో తెరపైనే చూడాలి’ అని దర్శకుడు సాయికిశోర్ మచ్చా అన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన లవ్ ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ‘ధూం ధాం’. చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ జంటగా నటించారు. ఎం.ఎస్.రామ్‌కుమార్ నిర్మాత. ఈ నెల 8న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం దర్శకుడు సాయికిశోర్ విలేకరులతో ముచ్చటించారు.
ఈ సినిమాను ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్ వారు విడుదల చేస్తుండటం ఆనందంగా ఉందని, హీరో చేతన్ అన్ని ఎమోషన్సూ అద్భుతంగా పండించాడనీ, తనకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందని, హెబ్బా పటేల్ పాత్ర ఆకట్టుకునేలా ఉంటుందని ఆయన తెలిపారు. గోపీసుందర్ సంగీతం, గోపీమోహన్ కథ, కథనాలు ఈ సినిమాకు ప్రధాన బాలాలని దర్శకుడు సాయికిశోర్ మచ్చా తెలిపారు.