‘ధూమ్’ ఫ్రాచైజీకి ప్రత్యేకంగా అభిమానులున్నారు. మరుగున పడిన మల్టీస్టారర్ ట్రెండ్‌కి మళ్లీ ఊతాన్నిచ్చిన ఫ్రాంచైజీగా ‘ధూమ్’ని చెప్పుకోవాలి. ‘ధూమ్’ తొలి పార్ట్‌లో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం నటించగా, ‘ధూమ్ 2’లో అభిషేక్ బచ్చన్, హృతిక్‌రోషన్ తలపడ్డారు. ఇక ‘ధూమ్ 3’ విషయానికొస్తే.. ఏసీపీ దీక్షిత్‌గా అభిషేక్ సేమ్ కేరక్టర్‌ని ప్లే చేయగా, కరుడుగట్టిన దొంగలైన సహీర్ఖాన్, సమర్ఖాన్గా మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్‌ఖాన్ ద్విపాత్రాభినయం చేసి బాలీవుడ్ రికార్డులన్నింటినీ కొల్లగొట్టారు. భారీ ఎత్తులో రాబరీలకు తెగబడుతూ దేశ సంపదను కొల్లగొడుతున్న కరుడుగట్టిన దొంగని కైమ్ బ్రాంచ్ ఏసీపీ దీక్షిత్ ఎలా పట్టుకున్నాడు? అనేదే మూడు సినిమాల్లో కథ.
ఈ ఫ్రాంచైజీలో ప్రతి సినిమా ఒకదాన్ని మించి ఒకటి ఉండటానికి కారణం దర్శకుడు ఆదిత్య చోప్రా కథనం. భారీ నిర్మాణ విలువలు. ఇదిలావుంటే.. ఈ ఫ్రాంచైజీలోనే త్వరలో ‘ధూమ్-4’ పట్టాలెక్కనున్నదట. చిత్ర నిర్మాణసంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొదటి మూడు పార్టులకు కథలను అందించిన ఆదిత్య చోప్రానే ‘ధూమ్-4’కు కూడా వర్క్ చేస్తున్నారని, మారిన ట్రెండ్‌కు అనుగుణంగా భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ ఫ్రాంచైజీలో నెగటీవ్ రోల్సే హైలైట్.
తొలిభాగంలో జాన్ అబ్రహం, రెండో భాగంలో హృతిక్‌రోషన్, మూడో భాగంలో ఆమిర్‌ఖాన్ ఈ రోల్స్ అదరగొట్టారు. ఇప్పుడు ‘ధూమ్-4’లో ఈ నెగిటీవ్ రోల్‌ని కోలీవుడ్ నటుడు సూర్య పోషిస్తారని బీటౌన్‌లో బలంగా వినిపిస్తున్నది. ఈ విషయంపై చిత్రబృందం ఇప్పటికే ఆయన్ని సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. సూర్య కూడా ఆ పాత్ర పోషించేందుకు ఆసక్తి చూపించారట. సూర్య నెగటీవ్ రోల్స్ చేస్తే ఎలా ఉంటుండో 24, విక్రమ్ సినిమాలు చెప్పేశాయి. ఇక ‘ధూమ్-4’లో ఆయన చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈ పరిణామంపై సినీప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యష్ రాజ్ సంస్థ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.