‘ఇందులో నా పాత్ర పేరు విక్రమ్. అనేక లేయర్లున్న పాత్ర ఇది. ‘ఈ క్యారెక్టర్లో ఏదో నెగిటివిటీ ఉంది.. ఇతనో టాక్సిక్ బోయ్.’ అనే ఇంప్రెషన్ ట్రైలర్ చూసిన వారికి కలుగుతుంది. అయితే.. ఈ పాత్ర చేసేటప్పుడు ‘దీన్ని నెగిటివ్ క్యారెక్టర్‌గా ఫీలై చేయొద్దు..’ అని క్లియర్‌గా చెప్పేవారు దర్శకుడు రాహుల్ రవీంద్రన్. ఇదో చిత్రమైన పాత్ర. నాది ఫిల్మ్ స్కూల్ బ్యాగ్రౌండ్ కాబట్టి తేలిగ్గా అర్థం చేసుకున్నా. పర్సనల్‌గా నాకు బాగా నచ్చిన స్క్రిప్ట్ ఇది.’ అని హీరో దీక్షిత్ శెట్టి చెప్పారు. రష్మిక మందన్నా ప్రధాన పాత్రధారిగా రూపొందిన ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ పాన్ఇండియా సినిమాలో దీక్షిత్ శెట్టి మేల్ లీడ్ పోషించారు.
రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలు. ఈ నెల 7న తెలుగు, హిందీ భాషల్లో.. ఈ నెల 14న తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో హీరో దీక్షిత్ శెట్టి విలేకరులతో మాట్లాడారు. ‘ ‘దసరా’ మూవీ కోసం చేసిన ఇంటర్వ్యూస్‌లో నన్ను చూసి, ఈ క్యారెక్టర్‌కు బావుంటానని దర్శకుడు రాహుల్ ఫిక్సయ్యారట. స్క్రిప్ట్ చదివాక ఈ పాత్రకు నన్నెందుకు అనుకున్నారో అర్థమైంది. ఇందులో నేను పోషించిన విక్రమ్ పాత్రపై డైరెక్టర్ రాహుల్‌కి పూర్తి క్లారిటీ ఉంది.
విక్రమ్ ఎలా ఉంటాడు? తన బాడీలాగ్వేజ్ ఎలా ఉంటుంది? ఎలా మాట్లాడతాడు? తదితర విషయాలను విపులీకరించి చెప్పేవారు. దాంతో నాకు పని సులువైంది. ఇప్పటివరకూ మనం ఒక తరహా ప్రేమకథనే చూశాం. ఇది ప్రేమకథల్లో మరో కోణం. కొన్ని సినిమాలు.. చూసి బయటకు వచ్చాక కూడా ఆ ఫీల్ మనతోపాటు క్యారీ అవుతూ ఉంటుంది. మనం కూడా ఆ సినిమా నుంచి ఏదోఒకటి తీసుకెళ్తాం. అలాంటి సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్’.’ అని పేర్కొన్నారు దీక్షిత్ శెట్టి. ఇంకా చెబుతూ ‘ఇందులోని ప్రతి పాత్ర, ప్రతి సందర్భం మన లైఫ్‌లో జరిగిన వాటిలా అనిపిస్తాయి. 18 నుంచి 25 ఏండ్ల యూత్ ఈ సినిమా చూస్తే తమ లైఫ్‌లో కొన్ని విషయాలు నేర్చుకుంటారు.
రష్మిక కూడా ఓ ఇంటర్వ్యూలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా కొన్నేళ్ల కిందట తాను చేసుంటే, తన జీవితం పట్ల తన దృక్పథం వేరేలా ఉండేదని చెప్పారు. దీన్ని బట్టి సినిమా ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇందులో రష్మిక నటన అనితరసాధ్యం. మీరు చూస్తున్నంత సేపూ మీకు రష్మిక కనిపించదు. భూమా అనే పాత్రే కనిపిస్తుంది. ఆమెలో ఒక స్టార్ అనే ఫీలింగే ఉండదు. అంత ఫ్రెండ్లీ నేచర్ నేను ఎక్కడా చూడ్లేదు.’ అని తెలిపారు దీక్షిత్ శెట్టి. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా నచ్చే సినిమా ఇదని, అల్లు అరవింద్ ఈ సినిమా చూసి, పిలిచి అభినందించారని, నెక్ట్స్ సినిమాకు అడ్వాన్స్ కూడా ఇచ్చారని, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో నటిస్తున్నాననీ, ఏ భాషలో చేసినా పాత్ర నచ్చితేనే చేస్తానని దీక్షిత్ శెట్టి తెలిపారు.