Dhanush | కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ సాగుతోంది. పలుమార్లు ఇద్దరూ కలిసి కనిపించడం, ఒకరి కుటుంబ సభ్యులతో మరొకరు సన్నిహితంగా ఉండడం వంటి అంశాలు ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చాయి. అయితే తాజాగా ఈ జంట విడిపోయిందనే వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.గత ఏడాది ఆగస్టులో మృణాల్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రీమియర్ షోలో ధనుష్, మృణాల్ కలిసి కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. అనంతరం ధనుష్ నటించిన ‘తేరే ఇష్క్ మే’ సినిమా పార్టీకి కూడా మృణాల్ హాజరుకావడం ఇద్దరి మధ్య ప్రత్యేకమైన అనుబంధం ఉందనే చర్చలకు దారి తీసింది.
అంతేకాకుండా, మృణాల్ తన సోషల్ మీడియా అకౌంట్లో ధనుష్ సోదరీమణులు డాక్టర్ కార్తీక, విమలా గీతలను ఫాలో అవ్వడం కూడా ఈ ప్రేమ వార్తలకు మరింత ఊతమిచ్చింది. దీంతో ఇద్దరూ డేటింగ్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ రూమర్లపై ధనుష్ ఎప్పుడూ నేరుగా స్పందించలేదు. అయితే మృణాల్ మాత్రం గతంలో ధనుష్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే అని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ వ్యాఖ్యలు కూడా పుకార్లకు పూర్తిగా తెరదించలేకపోయాయి. ఇదిలా ఉంటే, ఈ ఇద్దరికీ సన్నిహితంగా ఉన్న కొందరు వ్యక్తులు మాత్రం వారు నిజంగానే డేటింగ్ చేస్తున్నారని, కానీ ఆ సంబంధం ప్రారంభ దశలోనే ఉందని పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరికీ ఒకే విధమైన ఆలోచనలు, విలువలు ఉండడంతో ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటున్నారని, అయితే తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచాలని కోరుకుంటున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది.
తాజాగా కొన్ని సినీ వర్గాల కథనాల ప్రకారం ధనుష్, మృణాల్ మధ్య దూరం పెరిగిందని, ఇద్దరూ విడిపోయారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరి మధ్య విభేదాలకు గల కారణాలేమిటన్నది ఇప్పటివరకు బయటకు రాలేదు. మరోవైపు ఈ బ్రేకప్ వార్తలపై ఇప్పటి వరకు అటు ధనుష్ గానీ, ఇటు మృణాల్ గానీ అధికారికంగా స్పందించలేదు. దీంతో ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందన్నది ఇంకా స్పష్టత రాలేదు. ధనుష్ గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. దాదాపు 18 సంవత్సరాల వైవాహిక జీవితానంతరం 2022లో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.