‘ఈ సినిమా కోసం తిరుపతి ఎండల్లో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించి, బిచ్చగాడి పాత్రలో కనిపించడం మరచిపోలేని అనుభవం. అది నాకు ఎన్నో జీవిత సత్యాలను నేర్పించింది’ అన్నారు అగ్ర హీరో ధనుష్. ఆయన నాగార్జునతో కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘కుబేర’ ఆడియో లాంచ్ ఈవెంట్ ఆదివారం చెన్నైలో జరిగింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటించింది. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలు. ఈ నెల 20న విడుదల కానుంది.
ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ.. ‘రాంజనా’ షూటింగ్ సమయంలో కాశీలో చితుల మధ్య గడిపిన సమయంలో డబ్బు, విలాసాలు, ప్రాపంచిక సుఖాలు ఏవీ శాశ్వతం కాదని అర్థమైందని, స్వచ్ఛమైన మనసు ముఖ్యమనే అంశాన్ని ‘కుబేర’లో చర్చించామని, శేఖర్ కమ్ముల వంటి సహృదయత కలిగిన వ్యక్తితో పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చిందన్నారు. ‘నేను ఆడయార్లో పుట్టి..ఇక్కడి కాలేజీలోనే ఇంజనీరింగ్ చదువుకున్నా.
ఇక్కడే కెరీర్ను ఆరంభించాను. కొన్ని దశాబ్దాలుగా తమిళ ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు’ అని నాగార్జున పేర్కొన్నారు. ఈ సినిమాలో ధనుష్, నాగార్జున ఇద్దరూ మెస్మరైజింగ్గా పర్ఫార్మ్ చేశారని, చక్కటి సోషల్ డ్రామాగా ఆకట్టుకుంటుందని దర్శకుడు శేఖర్ కమ్ముల తెలిపారు. భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేయబోతున్నామని నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు చెప్పారు. తన కెరీర్లో ‘కుబేర’ ప్రత్యేకమైన చిత్రమని కథానాయిక రష్మిక మందన్న పేర్కొంది.