Dhanush- Aishwarya | కోలీవుడ్ క్రేజీ జంటలలో ధనుష్-ఐశ్వర్య జంట ఒకటి. ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరు ఊహించని కారణాల వలన విడిపోయారు. దాదాపు 18 సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత, ధనుశ్, ఐశ్వర్య 2022 జనవరి 17న తాము విడిపోతున్నట్లు ప్రకటించి పెద్ద బాంబ్ పేల్చారు. ఈ జంటకు చెన్నై ఫ్యామిలీ కోర్టు గత ఏడాది నవంబర్ 27, 2024న అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. కాగా, 2004లో చెన్నైలో ధనుశ్, ఐశ్వర్యలు అట్టహాసంగా వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే 18ఏళ్లు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్న వారు అలా విడిపోవడం ఎవరికి రుచించలేదు. తిరిగి కలిస్తే బాగుండని అనుకున్నారు.
అయితే ఇప్పుడు తమ కొడుకు కోసం వీరిద్దరు జంటగా కనిపించడం అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ధనుష్ కుమారుడు యాత్ర తన పాఠశాల విద్యను పూర్తిచేశాడు. ఇక పాఠశాలలో జరిగిన స్నాతకోత్సవానికి తన మాజీ భార్య ఐశ్వర్య రజినీకాంత్ తో కలిసి హాజరయ్యారు ధనుష్. ఈ సందర్భంగా తన కొడుకును కౌగిలించుకుని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ప్రౌడ్ పేరెంట్స్ అని రాసుకొచ్చాడు ధనుష్. విడిపోయిన కూడా తమ కొడుకు కోసం వారిద్దరు తిరిగి కలవడం సంతోషంగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కొడుకు సక్సెస్ చూసి ధనుష్ ఆనందం అవధులు దాటిందనే చెప్పాలి.
ఇక ఇదిలా ఉంటే ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న “కుబేర” చిత్రంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో నాగార్జున, రష్మిక మందన్న, జిమ్ సర్భ్, దలీప్ తాహిల్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ధనుష్ దర్శకత్వం వహించి .. నటించిన ఇడ్లీ కడై చిత్రం రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఇక ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహిస్తున్న హిందీ సినిమా తేరే ఇష్క్ మై లోను ధనుష్ నటిస్తున్నారు. అమరన్ డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించే ఒక చిత్రంలో, లాప్పర్ బంధు దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించే ప్రాజెక్టులో కూడా ధనుష్ భాగం కానున్నారు. ఇవే కాకుండా డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కించనున్న మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బయోపిక్ లో నటించనున్నారు. అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు ధనుష్.