‘సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు సినిమాతో హీరోయిన్గా కెరీర్‌ను ప్రారంభించడం, ఆ తరువాత వెంటనే రవితేజతో ‘ధమాకా’ లాంటి మంచి కమర్షియల్ సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ విషయంలో నేను దేవుడికి రోజూ కృతజ్ఞతలు చెప్పుకుంటాను’ అన్నారు అందాలతార శ్రీలీల. ఆమె రవితేజ సరసన నటిస్తున్న చిత్రం ‘ధమాకా’. త్రినాధరావు నక్కిన దర్శకుడు. రేపు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజా చిత్ర విశేషాలను పంచుకున్నారు నాయిక శ్రీలీల.
దర్శకుడు త్రినాధరావు తన గత చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రంలో ఓ పాత్ర కోసం నన్ను సంప్రదించారు. నా తొలిచిత్రం ‘పెండ్లిసందడి’ కంటే ముందే ‘ధమాకా’ కథ చెప్పారు. కథ చెప్పిన పది నిమిషాలకే సినిమా చేస్తానని ఒప్పుకున్నాను. పూర్తి హిలేరియస్ ఎంటర్టైనర్ ఇది. నాకు చిన్నప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలంటే చాలా ఇష్టం. ఈ చిత్రంలో ప్రణవి పాత్రలో కనిపిస్తాను. డ్యూయల్ రోల్‌తో ట్రావెల్ అయ్యే పాత్ర.. కన్ఫ్యూజింగ్గా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఈ చిత్రం ముగింపులో ఎవరూ ఊహించని ట్విస్ట్ ఉంటుంది. మొదట్లో రవితేజతో నటించడం అంటే కాస్త టెన్షన్ పడ్డాను. ఆయనతో పనిచేస్తుంటే ఆ టెన్షన్ పోయింది. రవితేజ ఎంతో ప్రోత్సహించేవారు. నేను మొదటి నుంచి ఆయనకు పెద్ద అభిమానిని. ‘విక్రమార్కుడు’ సినిమాను ఎన్నిసార్లు చూశానో లెక్కేలేదు. ‘విక్రమార్కుడు’లో డ్యూయల్రోల్ ఎంత బాగా నటించారో అంతకు మించి ‘ధమాకా’లో చేశారు.
రవితేజ అభిమానులు, ప్రేక్షకులు ‘ధమాకా’ గురించి ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో నేను కూడా అంతే క్యూరియాసిటీతో వున్నాను. తప్పకుండా ఈ చిత్రం కూడా నాయికగా మరింత పేరు తెస్తుందనే నమ్మకం వుంది. ప్రస్తుతం మెడిసిన్ గ్రాడ్యుయేషన్‌ని, సినిమాలను బ్యాలెన్స్ చేస్తున్నా.