ఎన్టీఆర్ ‘దేవర’ రిలీజ్ డేట్ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో భారీ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్గ్లింప్స్తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. విజువల్స్ అత్యున్నత ప్రమాణాలతో కనిపించాయి. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం తొలి భాగం ఏప్రిల్ 5న విడుదల కావాల్సి ఉంది.
అయితే ప్రతినాయకుడిగా నటిస్తున్న సైఫ్అలీఖాన్ ఇటీవల ప్రమాదానికి గురై శస్త్ర చికిత్స చేయించుకోవడం, గ్రాఫిక్స్ కోసం మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడనుందనే వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘దేవర’ విడుదల ఎప్పుడనే విషయం అభిమానుల్లో ఉత్సుకతను పెంచుతున్నది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా దసరా బరిలో విడుదల కాబోతున్నదని తెలిసింది. అయితే రిలీజ్ డేట్ విషయంలో ఇప్పుడొస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలేనని, చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటనతోనే స్పష్టత వస్తుందంటున్నారు.