Cinema News |బాలీవుడ్ కథానాయిక జాన్వీకపూర్‌కు దక్షిణాది చిత్రసీమ అంటే ఎంతో అభిమానం. ముఖ్యంగా తెలుగు సినిమాలంటే ఆమెకు ప్రత్యేకమైన ఇష్టం. తన తల్లి, దివంగత అందాల తార శ్రీదేవికి తెలుగునాట అభిమానగణం ఎక్కువని, అందుకే దక్షిణాదిలో తన అరంగేట్రానికి తెలుగునే ఎంచుకున్నానని పలు సందర్భాల్లో చెప్పిందీ భామ. ప్రస్తుతం జాన్వీకపూర్ ‘దేవర’లో ఎన్టీఆర్ జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో భాగం అయిన దగ్గరి నుంచి ఈ అమ్మడు తెలుగు సినిమాలను బాగా చూస్తున్నదట.
తాజాగా నాని నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రాన్ని ఓటీటీలో వీక్షించింది. నాని నటనపై ప్రశంసలు కురిపించింది. “నాని తండ్రి పాత్రలో అదరగొట్టాడు. ఇక మృణాల్ నటనకు ప్రేమలో పడిపోయా. మనసును స్పృశించే ఉద్వేగాలతో దర్శకుడు శౌర్యువ్ అద్భుతంగా తెరకెక్కించాడు’ అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది జాన్వీకపూర్. ఆమె స్పందనకు చిత్ర నిర్మాణ సంస్థ కృతజ్ఞతలు తెలిపింది. ‘మీ ప్రశంసలు చాలా విలువైనవి’ అంటూ ట్వీట్ చేసింది.