‘ప్రతి మనిషికి విధిరాత ఉంటుంది. ఏదో ఒక కారణంతోనే మనకు వ్యక్తులు పరిచయమవుతుంటారు. గత జన్మ రుణానుబంధం వల్లే ఇదంతా జరుగుతుంటుంది. భగవద్గీతలోని ఈ పాయింట్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం’ అన్నారు దర్శకుడు, హీరో దేవన్. స్వీయ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘కృష్ణలీల’ ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవన్ చిత్ర విశేషాలు తెలియజేశారు.
సినిమాలపై మక్కువతో తాను సాఫ్ట్వేర్రంగం నుంచి ఇండస్ట్రీకి వచ్చానని అన్నారు. ‘మనిషి కాలాన్ని వెనక్కు తీసుకురాలేడు. దైవిక కారణంతో ఒకవేళ కాలం మళ్లీ తిరిగి వస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించాం. ఇది ఆ భగవంతుడు ఆడించే ఆట కాబట్టి సినిమాకు ‘కృష్ణలీల’ అనే టైటిల్ పెట్టాం. కంటెంట్ పరంగా చాలా కొత్తగా ఉంటుందీ చిత్రం. ఈ సినిమా చూసిన తర్వాత సార్వజనీన ప్రేమ గొప్పతనం ఏమిటో అర్థమవుతుంది. మనతో పరిచయమున్న వ్యక్తులతో గొప్ప అనుబంధాన్ని ఫీలవుతాము. భీమ్స్ సిసిరోలియో సంగీతం ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది’ అన్నారు.