Tripti Dimri | కెరీర్ ఆరంభంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని, అయినా పట్టుదలతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నానని చెప్పింది త్రిప్తి డిమ్రి. ‘యానిమల్’ చిత్రం ద్వారా యూత్‌లో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ భామ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే ‘బ్యాడ్ న్యూజ్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ సందర్భంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాటి రోజుల్ని గుర్తుచేసుకుంది. ‘ నాకు చదువుపై అంతగా ఆసక్తి ఉండేది కాదు. దాంతో మోడలింగ్ వైపు అడుగుపెట్టా. పేరెంట్స్ కూడా సినిమాల్లోకి వెళతానంటే అంగీకరించలేదు.
ఇండస్ట్రీ కొచ్చిన తొలినాళ్లలో ఏ విషయం మీద అవగాహన ఉండేది కాదు. దాంతో నా సహచర నటీనటులతో సన్నివేశం గురించి చర్చిందేదాన్ని. ఒకానొక సమయంలో ఇండస్ట్రీకి వచ్చి సరైన నిర్ణయం తీసుకున్నానా? లేదా? అనే సందిగ్ధంలో పడ్డాను. ‘లైలా మజ్ను’ షూటింగ్ టైమ్‌లో సెట్స్‌లో ఏడ్చాను. వాళ్లు ఏం చెబుతున్నారో, ఆ భాష ఏమిటో అర్థమయ్యేది కాదు. దాంతో ఇంటికెళ్లి రాత్రిళ్లు డైలాగ్స్ ప్రాక్టీస్ చేశాను. ఎలాగో నా ప్రారంభ కష్టాల నుంచి గట్టెక్కి విజయాలను దక్కించుకున్నా’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ భామ మూడు సినిమాలతో బిజీగా ఉంది.