నేటి సాంఘిక మాధ్యమాల ఉధృతిలో సినీ ప్రముఖుల వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రచార హక్కులు దుర్వినియోగమవుతున్నాయి. ముఖ్యంగా కృత్రిమ మేధను ఉపయోగించి వాణిజ్య లాభాల కోసం సెలబ్రిటీల పేరును వాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినీ తారలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ ఉత్వర్వులు పొందుతున్నారు. తాజాగా అగ్ర హీరో ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టు ద్వారా ఉత్తర్వులు పొందారు. వివిధ మాధ్యమాల్లో తన పేరు, ఫోటోలను అనుమతి లేకుండా వాణిజ్యపరమైన ప్రయోజనాల కోసం వాడుతున్నారని ఎన్టీఆర్ కోర్టులో పిటిషన్ వేశారు.
దీనిని పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు ఆయన వ్యక్తిత్వ హక్కులకు రక్షణ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆయన పేరును, ఫొటోలను అనుమతి లేకుండా వాడటం చట్ట విరుద్ధమని కోర్టు పేర్కొన్నది. ఎన్టీఆర్ పిటిషన్ను 2021 ఐటీ రూల్స్ (ఇంటర్మీడియట్ గైడ్లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) కింద అధికారిక ఫిర్యాదుగా పరిగణించి చట్టపరమైన రక్షణకు ఆదేశించామని కోర్టు పేర్కొన్నది. ఎవరైనా సాంఘిక మాధ్యమాల వేదికగా ఎన్టీఆర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.