న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి కరిష్మా కపూర్(Karisma Kapoor)కు భారీ ఊరట దక్కింది. వ్యాపారవేత్త సంజయ్ కపూర్ ఆస్తుల వీలునామా వివాదం నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సంజయ్ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు మూడో భార్య ప్రియా సచ్దేవ్ కపూర్ ప్రయత్నిస్తున్నట్లు కర్మిషా పిల్లలు కేసు వేశారు. సంజయ్ కపూర్ రెండో భార్య కరిష్మా కపూర్. అయితే కర్మిషాకు విడాకులు ఇచ్చిన తర్వాత ప్రియా సచ్దేవ్ను సంజయ్ కపూర్ పెళ్లి చేసుకున్నారు.
సంజయ్ గత ఏడాది లండన్‌లో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. సుమారు 30 వేల కోట్ల ఖరీదైన ఆస్తులను సంరక్షించాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. సంజయ్ కపూర్ రాసిన వీలునామాపై అనుమానాలు ఉన్నట్లు ఆయన తల్లి రాణి కపూర్‌తో పాటు కరిష్మా కపూర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ అనుమానాలను తొలగించే బాధ్యత ప్రియా కపూర్‌పై ఉన్నట్లు జస్టిస్ జ్యోతి సింగ్ తన తీర్పులో పేర్కొన్నారు. వీలునామా చెల్లుబాటు అంశంపై విచారణ సాగుతున్న నేపథ్యంలో, ఈ కేసులో మరింత సమయం పడుతుందని, అయితే ఈ సమయంలో సంజయ్ కపూర్ ఆస్తులను సంరక్షించాలని కోర్టు పేర్కొన్నది.