Richest Actress | సినిమా అనేది రంగుల ప్రపంచం. ఇందులో జీవితం ఎన్నిరోజులు ఉంటుందో చెప్పలేం. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది గాల్లో దీపంలానే ఉంటుంది. అందుకే చాలామంది హీరోయిన్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని చూస్తుంటారు. సినిమా సినిమాకు భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుంటారు. తమ ఫేమ్‌తో యాడ్స్‌లోనూ నటిస్తూ కోట్లు వెనుకేసుకుంటూ ఉంటారు. అలా ఇండియాలో అత్యధిక ఆస్తులు వెనుకేసుకున్న టాప్ 10 స్టార్ హీరోయిన్స్ ఎవరనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
బాలీవుడ్లో అత్యధిక సంపాదిస్తున్న హీరోయిన్ల విషయానికొస్తే.. ఐశ్వర్యరాయ్ బచ్చన్ అగ్రస్థానంలో ఉంది. ఈమె ఒక్కో సినిమాకు 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నది. అది కాకుండా అడ్వర్టయిజ్మెంట్ల రూపంలో 7 నుంచి 8 కోట్ల వరకు సంపాదిస్తున్నది. దీంతో నికరంగా ఆమె ఆస్తి విలువ 800 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. చాలాకాలంగా సినిమాలు తగ్గించినప్పటికీ అందరికంటే ఎక్కువ ఆస్తులతో అగ్రస్థానంలో ఉండటం విశేషం.
ఐశ్వర్యరాయ్ తర్వాత రెండో ప్లేస్‌లో ప్రియాంక చోప్రా ఉంది. బాలీవుడ్‌ను వదిలేసి హాలీవుడ్‌కే పరిమితమైన ఈ బ్యూటీ.. సినిమాలు, అడ్వర్టయిజ్మెంట్ల రూపంలో కోట్లలో సంపాదిస్తున్నది. అంతేకాకుండా ఈమె పేరుతో సొంతంగా ఓ బ్యూటీ ప్రొడక్ట్స్ ఉత్పత్తుల కంపెనీ ( అనొమలీ), దుస్తుల కంపెనీ(పర్ఫెక్ట్ మూమెంట్), న్యూయార్క్‌లో రెస్టారెంట్ (సోనా ) ఉన్నాయి. అలాగే పర్పుల్ పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను నడుపుతోంది. ఇవి కాకుండా చాలా స్టార్టప్ కంపెనీల్లో ప్రియాంక చోప్రా పెట్టుబడులు పెట్టారు. అలా ప్రియాంక చోప్రా ఆస్తుల విలువ దాదాపు 600 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
రిచెస్ట్ హీరోయిన్ల జాబితాలో ఆలియా భట్ మూడోస్థానంలో ఉంది. ఆలియా ఒక్కో సినిమాకు రూ.9 నుంచి 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నది. ఆలియా భట్ రీసెంట్గా ఎడ్ ఎ మమ్మా అనే క్లాతింగ్ బ్రాండ్‌ను కూడా ఓపెన్ చేసింది. ఈ సంస్థ టర్నోవర్ రూ.150 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఎటర్నల్ సన్‌షైన్ పేరుతో నిర్మాణ సంస్థను కూడా రన్ చేస్తున్నది. అలాగే డ్యూరోఫ్లెక్స్, ఎవర్, క్యాడ్బరీ, క్వాలిటీవాల్స్, కార్నెటో, ఫ్రూటీ వంటి బ్రాండ్లకు సంబంధించిన అడ్వర్టయిజ్మెంట్ల రూపంలోనూ బాగానే సంపాదిస్తున్నది. ఇలా దాదాపు 550 కోట్ల వరకు కూడబెట్టింది.
ఇక నాలుగో స్థానంలో దీపికా పదుకోన్ ఉంది. సినిమాలు, అడ్వర్టయిజ్మెంట్ల రూపంలోనే ఈమె ఎక్కువగా సంపాదిస్తున్నది. బాలీవుడ్లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో దీపిక ముందుంటుంది. ఒక్కో సినిమాకు రూ.25 నుంచి 30 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నది. ఏషియన్ పెయింట్స్, లాయిడ్, జాగ్వర్, జియో, లోరియల్, తనిష్క్, కొకా కోలా వంటి కంపెనీలతో ఈమెకు ఒప్పందాలు ఉన్నాయి. అలాగే 82E అనే సౌందర్య ఉత్పత్తుల కంపెనీ కూడా ఉంది. దీపిక పదుకోన్ ఆస్తుల విలువ దాదాపు 500 కోట్ల వరకు ఉండొచ్చు.
సంపన్న కథానాయికల్లో కరీనా కపూర్ ఖాన్ ఐదో స్థానంలో నిలిచింది. ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నది. ఒక్కో అడ్వర్టయిజ్‌మెంట్‌కు రూ.6కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నది. అలాగే స్టేజ్ షోలు, రేడియో షోల రూపంలోనూ భారీగానే సంపాదిస్తున్నది. కరీనా ఆస్తుల విలువ రూ.485 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా.
ఆరో స్థానంలో ఉన్న కత్రినా కైఫ్ ఒక్కో సినిమాకు రూ.7-8 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నది. ఒక్కో యాడ్‌కు రూ.7కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నది. ఇక కత్రినాకు చెందిన బ్యూటీ ప్రొడక్ట్ బ్రాండ్ కాయ్ బ్యూటీ ద్వారా ఏడాదికి రూ.100 కోట్ల వరకు సంపాదిస్తున్నది. ఆమె నికర ఆస్తుల విలువ రూ.264 కోట్లు ఉంటుందని సమాచారం.
రూ.255 కోట్లతో అనుష్క శర్మ ఏడో స్థానంలో, రూ.250 కోట్లతో మాధురీ దీక్షిత్ 8వ స్థానంలో, రూ.235 కోట్లతో కాజోల్ 9వ స్థానంలో, రూ.206 కోట్లతో రాణి ముఖర్జీ 10వ స్థానంలో ఉన్నారు.