ప్రెగ్నెన్సీ కారణంగా షూటింగ్లకు దూరమైన దీపిక.. మళ్లీ కెమెరా ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు దీపిక పడుకోన్. ‘జీవితం అంటే అనుభవాల సమాహారం. అందులో కొన్ని చేదుగా ఉంటే, కొన్ని తీపిగా ఉంటాయి.
ప్రస్తుతం అమ్మగా తీయనైన అనుభూతిని ఎంజాయ్ చేస్తున్నాను. ఇక నటిగా నా బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే ఓవైపు కథలు కూడా వింటున్నా. ‘కల్కి2898ఏడీ’ తర్వాత సౌత్ నుంచి కొన్ని ఆఫర్లు వచ్చాయి. కానీ.. నా స్థాయికి తగ్గట్టుగా అవి లేవు. అందుకే అంగీకరించలేదు.
సరైన కథలు వస్తే తప్పకుండా మళ్లీ సౌత్ సినిమాలో నటిస్తా’ అని తెలిపారు దీపిక పడుకోన్. ఇంకా మాట్లాడుతూ- ‘నేను పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేస్తున్నానని ఓ వార్త ఈ మధ్య బాగా ట్రోల్ అవుతున్నది. అందులో ఏ మాత్రం నిజం లేదు. ‘కల్కి 2898ఏడీ’కి ఏకంగా పదికోట్లు తీసుకున్నానని కూడా రాసేశారు. అవాస్తవాలు ప్రచారం చేయడం వల్ల వాళ్లకు ఒరిగేదేంటో నాకైతే అర్థం కాలేదు. కథ, పాత్ర నచ్చితే.. రెమ్యునరేషన్ గురించి నేను పట్టించుకోనని నా నిర్మాతలందరికీ తెలుసు’ అంటూ చెప్పుకొచ్చింది దీపిక పడుకోన్.