Deepika Padukune | ‘ముంబయ్‌లో అడుగుపెట్టినప్పుడు నాది చాలా చిన్నవయసు. నాకు ఆత్మాభిమానం ఎక్కువ. ఆధారపడి బతకడం ఇష్టం ఉండేదికాదు. అందుకే నా తిండి నేను సంపాదించుకోవాలని నిశ్చయించుకున్నాను. అనుకున్నట్టే కష్టపడ్డాను. ఆ రోజుల్లో నాకు ఓ రూమ్‌కూడా ఉండేదికాదు. చేతిలో బండెడు లగేజ్. అర్ధ రాత్రుళ్లు దాకా పనిచేసి ఆ లగేజ్తోనే క్యాబ్‌లో నిద్రపోయేదాన్ని. అవన్నీ గుర్తొస్తే ఏదో తెలీని ఆనందం. సాధించాననే చిన్న గర్వం’ అంటూ చెప్పుకొచ్చింది దీపికా పదుకొణె.
ఇటీవల ఆమె ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించింది. ‘ నాకు సినిమా అంటే పిచ్చి. హీరోయిన్ అవ్వడమే నా టార్గెట్. నాకు వేరే పనిరాదు. ఇండస్ట్రీలో వారసులదే రాజ్యం. నాకు గాడ్‌ఫాదర్స్ లేరు. నాకు నేనే బలం అనుకున్నాను. ఎప్పటికప్పుడు మానసికంగా నాకునేను స్ట్రాంగ్ అవుతూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, తీరిక లేకుండా పనిచేస్తూ నాకునేను ఓ మార్గాన్ని ఏర్పరచుకున్నాను. నేను వర్క్‌హాలిక్ అని చెప్పకోటానికి గర్వపడతా’ అని దీపిక చెప్పింది.
ఇంకా తన భర్త రణ్వీర్ గురించి మాట్లాడుతూ ‘ఇద్దరం బిజీ జీవితాలు గడుపుతున్నాం. కొన్నిసార్లు తను అర్ధరాత్రి ఇంటికొస్తాడు. నేను తెల్లవారు జామునే వెళ్లిపోవాలి. కలిసి బతకడానికి సమయం దొరకట్లేదు. అందుకే ఇకనుంచి మా ఇద్దరి కోసం ఓ షెడ్యూల్ పెట్టుకోవాలనుకుంటున్నాం’ అని చెప్పుకొచ్చింది దీపిక.