పరిచయం అక్కర్లేని బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె. పెండ్లి తర్వాత కూడా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ భామ, త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమాలో ఓ కీలకపాత్రలో కనిపించబోతున్నది. తన ఇష్టాయిష్టాల గురించి ఇటీవల కొన్ని సంగతుల్ని పంచుకుంది..
అమ్మానాన్నలు నన్నూ, చెల్లినీ మొదటినుంచీ నిరాడంబరంగానే పెంచారు. నేను కూడా ఎన్ని సినిమాలు చేసినా నటనను కేవలం వృత్తిగానే భావిస్తా. ఇంట్లో సాధారణ దీపికలానే ఉండేందుకు ప్రయత్నిస్తా. ఇప్పటికీ నేనస్సలు మారలేదనీ, సినిమాల్లోకి రాకముందు ఎలా ఉన్నానో… ఇప్పుడూ అలానే ఉన్నాననీ మా బంధువులు అంటుంటారు. వాళ్లు కూడా నన్ను సెలబ్రిటీలా చూడరు. రణ్వీర్కూడా సింపుల్‌గా ఉండేందుకే ఇష్టపడతాడు. మాకు పుట్టబోయే పిల్లల్ని కూడా అలాగే పెంచాలనుకుంటున్నాం.
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోజులు ఇంకా గుర్తున్నాయి. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా బోలెడు సవాళ్లుండేవి. నా రోజువారీ పనులు, వంట, ప్రయాణ ఏర్పాట్లు, దుస్తులు… ఇలా అన్నీ చూసుకుంటూ షూటింగ్‌లకు వెళ్లేదాన్ని. ఒక్కోసారి ఏ రాత్రికో షూటింగ్ పూర్తయితే క్యాబ్‌లో ఇంటికి ఒంటరిగానే వచ్చేదాన్ని. ఆ అలసటతో క్యాబ్‌లోనే నిద్రపోయిన సందర్భాలూ ఉన్నాయి. నేను ఇంటికి చేరే వరకూ అమ్మ కంగారుపడుతుండేది. అయినా ఏ ఒక్క రోజూ నా పనుల్ని భారమనుకోకుండా ఇష్టంగానే చేసుకునేదాన్ని. ఆ రోజుల్ని తలుచుకుంటే నాపై ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు తాగుతా. కాసేపు ఒంటరిగా గడుపుతా, ధ్యానం చేస్తా. అప్పుడే నాకు ఒత్తిడిని తట్టుకునే శక్తి వస్తుందని నమ్ముతా. ఏ మాత్రం ఖాళీ దొరికినా విశ్రాంతి తీసుకుంటా. ఇంటి పనులు చేసేందుకు ఇష్టపడతా. కుటుంబ సభ్యులతో, మరీ ముఖ్యమైన వారితో తప్ప ఇతరులతో ఎక్కువగా మాట్లాడను.
షూటింగ్‌లూ,
ఇతర పనుల కారణంగా నాకు, రణ్‌వీర్‌కు అస్సలు తీరిక దొరకదు. అందుకే ఇద్దరం ఇంట్లో ఉన్నప్పుడు సరదాగా కబుర్లు చెప్పుకొంటూనే మాకు నచ్చిన పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తాం. నాకు, చెల్లికి చిన్నప్పటి నుంచీ లియోనార్డో డికాప్రియో అంటే క్రష్. ఆ ఇష్టంతోనే ఆయన పోస్టర్లను గోడకు అతికించుకునేవాళ్లం. టాలీవుడ్లో మహేశ్‌బాబు అంటే ఇష్టం. చిన్నప్పుడు చాలా అల్లరి చేసేదాన్ని. అప్పుడు చేసిన అల్లరి పనులు తలుచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తుంది.