Deepika Padukone | బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నది. కల్కి 2898 ఏడీ సీక్వెల్ దీపికాను నటించడం లేదని మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దీపికా తప్పుకుందని.. లేదు మేకర్స్ తప్పించారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి తప్పుకున్న తర్వాత సోషల్ మీడియా వేదికగా దీపికా పోస్ట్ చేసింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌తో ‘కింగ్’ మూవీలో నటించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు షారుఖ్ చేతిని పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ దీపికా ఎమోషనల్ అయ్యింది. దీపికా పోస్ట్ కల్కీని ఉద్దేశించేనని పలువురు భావిస్తున్నారు.
కల్కి 2898 ఏడీ సీక్వెల్ తర్వాత దీపికా తొలిసారిగా సోషల్ మీడియా వేదికగా మళ్లీ షారుఖ్‌తో కలిసి నటించనున్నట్లు ధ్రువీకరించింది. షారుఖ్ ఖాన్ చేయి పట్టుకున్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇందులో కేవలం ఇద్దరి చేతులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ సందర్భగా షారుఖ్ తనకు నేర్పించిన పాఠాన్ని దీపిక గుర్తుచేసుకుంది. పోస్ట్‌లో దీపికా ‘దాదాపు సంవత్సరాల కిందట కెరీర్ ప్రారంభంలో ‘ఓం శాంతి ఓం’ చిత్రం సమయంలో షారుక్ నాకు చెప్పిన తొలి పాఠం. సినిమా విజయానికంటే, షూటింగ్ సమయంలో వచ్చే అనుభవం, మనతో పనిచేసే వ్యక్తులే ముఖ్యమని.. ఆ మాటలు అప్పటి నుంచి ప్రతి నిర్ణయానికి ఆధారంగా పెట్టుకున్న. అందుకే మేమిద్దరం ఇప్పుడు 6వ సినిమా చేస్తున్నాం’ పోస్ట్ పెట్టింది.
షారుఖ్, దీపికా కింగ్ మూవీలో కనిపించనున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నారు. దీపికా పదుకొనే 2007లో “ఓం శాంతి ఓం” చిత్రంలో షారుఖ్‌తో కలిసి తన బాలీవుడ్ కెరీర్‌ను ప్రారంభించింది. అప్పటి నుంచి షారుఖ్‌తో కలిసి హ్యాపీ న్యూ ఇయర్, చెన్నై ఎక్స్‌ప్రెస్, పఠాన్, జవాన్ చిత్రాల్లో కలిసి నటించింది. తాజాగా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న కింగ్ చిత్రంలో ఈ జంట కనిపించనున్నది.
ఇదిలా ఉండగా.. ఇటీవల ‘కల్కి 2898 AD’ చిత్ర నిర్మాతలు దీపిక ఈ చిత్రం సీక్వెల్ నుంచి తప్పుకున్నట్లుగా సోషల్ మీడియా పోస్ట్ వెల్లడించారు. ‘కల్కి 2898 AD’ రాబోయే సీక్వెల్ లో దీపికా పదుకొనే భాగం కాదని అధికారికంగా ప్రకటించారు. చాలా చర్చల తర్వాత, మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం. తొలి పార్ట్ చేసేటప్పుడు ఆమెతో చాలా ప్రయాణం జరిగినప్పటికీ, మళ్లీ తనతో కలిసి పనిచేసే అవకాశం కనిపించలేదు. అలాంటి భారీ ప్రాజెక్ట్‌కి పూర్తి నిబద్ధత అవసరం. దీపికాకు భవిష్యత్తులోని ప్రాజెక్ట్స్‌కి శుభాకాంక్షలు అంటూ మేకర్స్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.
దీపికా ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘కింగ్’ చిత్రంలో నటిస్తుండగా.. ఈ మూవీలో షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్, అర్షద్ వార్సీ, రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్, జైదీప్ అహ్లవత్, అభయ్ వర్మ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీపిక అల్లు అర్జున్ తో కలిసి అట్లీ దర్శకత్వంలో వస్తున్న ‘AA22xA6’ సినిమాలో కూడా నటించనున్నది.