ఇప్పుడున్న పరిస్థితుల్లో అల్లు అర్జున్ సినిమా అంటే ఆడియన్స్‌లో ఎక్స్పెక్టేషన్లని అంచనా వేయలేం. బన్నీ స్టార్డమ్ ఆ స్థాయిలో పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ దిగ్గజ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించనున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ అడ్వెంచర్ గురించి వచ్చే అప్డేట్ల కోసం సగటు ప్రేక్షకుడు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ని శనివారం వెలుగుచూసింది.
ఇందులో కథానాయికగా బాలీవుడ్ గ్లామర్ క్వీన్ దీపికా పదుకోన్ ఖరారైనట్టు మేకర్స్ శనివారం ప్రకటించారు. బిగ్గెస్ట్ విజువల్ వండర్‌గా రానున్న ఈ సినిమాలో అద్భుతమైన తారాగణం భాగం కానున్నట్టు ఈ సందర్భంగా వారు తెలిపారు.
ఈ భారీ కాంబోను తెలియజేసేలా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. డైరెక్టర్ అట్లీతో దీపికా పదుకోన్ మాట్లాడే సన్నివేశాలతో ప్రారంభమైన ఈ గ్లింప్స్, దీపిక శక్తివంతమైన పాత్రలోకి మారుతున్న తీరును ఆవిష్కరించింది. హెడ్ గేర్‌ను ధరించి ఆమె ఫుల్ కాస్ట్యూమ్స్‌తో ఓ యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్టు సెట్లోకి ఎంట్రీ ఇచ్చారు.
హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు, రోమాంచితం చేసే యాక్షన్ సన్నివేశాలు, గ్రాండ్ విజువల్స్తోపాటు మన సంస్కృతికి అద్దం పట్టే కథతో గ్లోబల్ ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ సినిమా రూపొందనున్నదని, దీపికా పదుకోన్ భాగం కావడంతో ఈ ప్రాజెక్ట్ రేంజ్ మరోస్థాయికి చేరిందని, షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభిస్తామని, పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని అట్లీ, కళానిధి మారన్ తెలియజేశారు.